‘మోదీ బీసీ కాదు.. బిగ్‌ క్రిమినల్‌’

7 Apr, 2018 14:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు రాకుండా చేసిన కేంద్రప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసంలో ఓడిపోతామనే చర్చకు రాకుండా చేశారన్నారు. ఎల్‌కే అద్వానీ లాంటి సీనియర్‌ నేతలు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయం ప్రధాని మోదీకి పట్టుకుందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం దుర్మార్గమన్నారు. 5 కోట్ల ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం అగౌరవ పరిచిందని, దేశంలో బీజేపీని ఒంటరి చేస్తామన్నారు. మోదీ బీసీ కాదని.. బిగ్‌ క్రిమినల్‌ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్‌ మీ అనుబంధ సంస్థా?
చంద్రబాబు నాయుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారని రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు కలియుగ కుంభకర్ణుడన్నారు. నాలుగేళ్లు తమని అవమానించి, కేసులు పెట్టిన చంద్రబాబుకు ఇపుడు అఖిలపక్షం గుర్తొచ్చిందా .. కాంగ్రెస్‌ ఏమైనా మీ అనుబంధ సంస్థ అనుకుంటున్నారా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లేటపుడు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకువెళ్లలేదన్నారు. దేశ రాజధానిలో హేమాహేమీలను కలిసి వస్తారనుకున్నామని.. కానీ హేమమాలినిని కలిశారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు