ఒక్క ఓటు కోసం ఆరుగురు సిబ్బంది

12 Apr, 2019 17:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమయం ఉదయం 9.30 గంటలు. గురువారం. అది అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మలోగామ్‌ గ్రామం. అప్పటికే నూటికి నూరు శాతం పోలింగ్‌ పూర్తయింది. అదెలా అంటూ ఆశ్చర్య పోనవసరం లేదు. సొకేలా తయాంగ్‌ అనే 39 ఏళ్ల ఏకైక మహిళా ఒటరు వచ్చి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిబెట్‌కు సరిహద్దు కొండల్లో ఉన్న అడవిలో మలోగామ్‌ ఉంది. 2011లో నిర్వహించిన సెన్సెస్‌ ప్రకారం ఆ గ్రామంలో ఓ ఇల్లు ఐదుగురు కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. వారిలో సొకేలా తయాంగ్‌ ఒక్కరే ఓటరుగా నమోదు చేయించుకున్నారు.

ఆ ఒక్క ఓటు కోసం ప్రిసైడింగ్‌ అధికారి గమ్మర్‌ బామ్‌(34) తన నలుగురు సిబ్బంది, ఓ సిక్యూరిటీ గార్డు, ఓ జర్నలిస్ట్‌తో కలిసి బుధవారం ఉదయం బస్సులో మలోగామ్‌ బయల్దేరారు. అటవి ప్రాంతానికి వెళ్లాక అక్కడి నుంచి కాలి నడకన వెళ్లాల్సి వచ్చింది. సాధారణంగా సమీపంలోని ప్రభుత్వ అధికారిని ప్రిసైడింగ్‌ అధికారిగా నియమిస్తారు. ఇక్కడ ప్రిసైడింగ్‌ అధికారిగా, ఎన్నికల సిబ్బందిగా పర్వతారోహకులుగా కొండలెక్కే అలవాటు ఉన్న వాళ్లను ఎంపిక చేశారు. అంతేకాకుండా ఆ ఏకైక ఓటరుకు పోలింగ్‌ షెడ్యూల్‌ తెలియజేయడానికి ప్రత్యేకంగా సొకేలా తయాంగ్‌ వద్దకు ఓ కొరియర్‌ను పంపించారు.

కొండ ప్రాంతానికి చేరుకున్న ఎన్నికల సిబ్బంది గురువారం ఉదయమే రేకులతో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, 9.30 గంటల ప్రాంతంలో సొకేలా తయాంగ్‌ పచ్చి తన ఓటింగ్‌ హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయాలంటే సిగ్నల్స్‌ లేక టెలిఫోన్లు పనిచేయలేదు. చివరకు ఆ రోజు సాయంత్రానికల్లా పోలీసుల ద్వారా హవాయ్‌ అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారి సోడె పోటమ్‌కు తెలియజేశారు.

ఒక్క ఓటు కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని పోటమ్‌ను మీడియా ప్రశ్నించగా ఖర్చు ఎంత అన్నది ఇక్కడ ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కల్పించామా, లేదా? అన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ పోలింగ్‌ బూతుకు ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించిన గమ్మర్‌ బామ్, ఆరుణాచల్‌ విద్యుత్‌ శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఒక్క ఓటు కోసం తనతో కలిసి ఐదుగురు పోలింగ్‌ సిబ్బంది, ఓ జర్నలిస్ట్, ఓ పోలీసు అధికారిని తీసుకొని రావాల్సి వచ్చింది.

2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సొకేలా తయాంగ్, తన భర్త జనేలం తయాంగ్‌తో కలిసి రెండు ఓట్లు వేశారు. అయితే ఆ తర్వాత ఆమె భర్త తన ఓటు హక్కును మరో చోటుకు బదిలీ చేయించుకోవడంతో ఈసారి ఆమె ఒక్కరే ఓటు వేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు