నేను ఎంపీ సీటు అడగలేదు: అవంతి శ్రీనివాస్

16 Feb, 2019 16:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారి విశాఖ వచ్చిన ఆయనకు శనివారం పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని అన్నారు. ఇక నుంచి వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. (అవంతి పోకతో మొదలు.. టీడీపీకి చెదలు)

ఎవ్వరికీ భయపడను..
విలువల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నమ్మించి మోసం చేయడం ఆయనకు అలవాటేనని, స్వార్థ రాజకీయాల కోసం తాను పార్టీ మారలేదని అన్నారు. చంద్రబాబును ఎన్నడూ ఎంపీ సీటు అడగలేదని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. తాను భీమిలీ అసెంబ్లీ సీటు అడిగితే ఎంపీగా ఎందుకు పంపించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే భయపడనని, అలాంటిది చంద్రబాబుకు భయపడతానా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం బలాన్ని చూసి భయపడ్డ చంద్రబాబు వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారన్నారు. 

చంద్రబాబు తనకు రోల్‌ మోడల్ అని చెప్పుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు మాటలు వాస్తవమేనని అవంతి శ్రీనివాస్‌ అంగీకరించారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబే మంత్రి గంటాకు ఆదర్శమన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చని అనుకుంటే పొరపాటేనని, గంటా గురించి తెలియాలంటే మంత్రి అయ్యన్నపాత్రుడిని అడిగితే సరిపోతుందన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న ఆయన ఒక్కరోజు కూడా సమన్వయకమిటీ సమావేశాలకు హాజరు కాలేదని, అలాంటిది తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. 

గంటా టార్గెట్‌ అమరావతిలో సీఎం కుర్చీ..
తనపై పోటీ చేసే వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని ఆయన... దయచేసి మంత్రి గంటా తన జోలికి రావద్దొని ఇక నుంచి మీ పని మీరు చేసుకోండి...నా పని నేను చేసుకుంటాను అని అవంతి శ్రీనివాస్‌ హితవు పలికారు. టీడీపీ అధికార ప్రతినిధి అంటే ప్రతిపక్ష పార్టీని తిట్టడమే పని అని ఆయన అన్నారు. గంటా శ్రీనివాసరావు లక్ష్యం భీమిలి అసెంబ్లీ సీటు కాదని, ఏకంగా అమరావతిలో ముఖ్యమంత్రి కుర్చీ అని వ్యాఖ్యానించారు. గంటాను నమ్మి టీడీపీలోకి వెళ్లినవారిలో చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబుకు టికెట్‌ లేకుండా చేశారని గుర్తు చేశారు. భీమిలి నియోజకవర్గ ప్రజలను మంత్రి గంటా హీనంగా చూస్తారన్నారు. తానంతట తాను టీడీపీలోకి వెళ్లిలేదని, వాళ్లు పిలిస్తేనే వెళ్లానన‍్న అవంతి శ్రీనివాస్‌ ...తనకు రెండు లక్షలమంది విద్యార్థుల శక్తి ఉందన్నారు.

మరిన్ని వార్తలు