యుద్ధ మేఘాల్లో ఎవరిది రాజకీయం?

28 Feb, 2019 15:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి చర్చించేందుకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యాయి. ముందుగా సోనియా గాంధీ మాట్లాడుతూ భారత్, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి చర్చించుకోవడం భావ్యం కాదని, చర్చను వాయిదా వేయడం సముచితమని సూచించారు. దానికి 21 పార్టీల నుంచి హాజరైన నాయకులు ఆమోదం తెలిపి ఉద్రిక్త పరిస్థితుల గురించి చర్చించారు. ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జాతి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. కనీసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. (ప్రచారం కోసం ఇంత అబద్ధమా!)

పాక్‌ యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లి పాక్‌ సైనికులకు బంధీగా చిక్కిన భారత పైలట్‌ అభినందన్‌ పట్ల సానుభూతి ప్రకటించారు. ఆయన  క్షేమంగా తిరిగి రావాలని ఆకాక్షించారు. పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లకు మౌనం పాటించి నివాళులర్పించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా బుధవారం నాడు అహ్మదాబాద్‌లో జరగాల్సిన పార్టీ సమావేశాన్ని, తన ర్యాలీని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రద్దు చేసుకున్నారు. మరోపక్క తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే. తారక రామారావు బుధవారం నాడు, మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన లోక్‌సభ నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. భారత్, పాక్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరి ఆరోజు మోదీ ఏం చేశారు ?
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకుపోయి బాలకోట్‌ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన రోజే (ఫిబ్రవరి 26) ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని చురులో పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. అదే రోజు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సెల్ఫీలు దిగారు. ఇస్కాన్‌ సాంస్కృతిక కేంద్రానికి వెళ్లి 800 కిలోల బరువున్న భగవద్గీతను ఆవిష్కరించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత ఆ దేశం భూభాగంలోకి చొచ్చుకుపోవడం ఇదే మొదటిసారి. దీనిపై అంతర్జాతీయ ఒత్తిడులను లేదా స్పందనలను ఎదుర్కోవడానికి నరేంద్ర మోదీ తన కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండాల్సిన సమయం. పైగా ఆరోజు ప్రధాని మంత్రి లేదా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కాకుండా విదేశాంగ కార్యదర్శి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

సరే, మంగళవారం నాడు భారత వైమానిక దళానిది పైచేయి అవడం వల్ల మోదీ యథాలాపంగా తన షెడ్యూల్డ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారని అనుకున్నాం. బుధవారం నాటికి పరిస్థితి తీవ్రమైంది. సరిహద్దుల్లో పరస్పర వైమానిక దాడులు జరగడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్‌ సైనికులకు భారత పైలట్‌ బంధీ అయ్యారు. ఆరోజు ఉదయం మోదీ ‘నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్నారు. అందులో ‘ఖేలో ఇండియా యాప్‌’ను ప్రారంభించారు. అంతేకాకుండా గురువారం ‘మేరా బూత్‌ సబ్సే మజ్బూత్‌’ కార్యక్రమం కింద వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజలతో మాట్లాడుతూ పాకిస్థాన్, భారతీయులను విడదీయాలని చూస్తోందని కూడా ఆరోపించారు.

మరో పక్క కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడ్యూరప్ప బుధవారం చిత్రదుర్గలో మాట్లాడుతూ పాక్‌పై జరిపిన వైమానిక దాడులతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం 22 సీట్లను గెలుచుకుంటామని ప్రకటించారు. దేశ భద్రత గురించి ఢిల్లీలో బుధవారం ఉన్నతాధికారులతో చర్చించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు వెళ్లి పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపగాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాక్, భారత్‌ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకోవడం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. (సర్జికల్‌ స్ట్రైక్స్‌-2: మేం 22 సీట్లు గెలుస్తాం!)

పొరుగునున్న పాక్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నప్పుడు పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పర భిన్న వైఖరులు అవలంబించాయి. అవలంబిస్తున్నాయి. ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? ఎవరిది రాజకీయం ? ఎవరిది దౌత్యం ? ఇక ఎవరిది నిజమైన దేశభక్తి ? అని ప్రశ్నించడం చాలా పెద్ద మాట అవుతుందేమో! పాలకపక్షమే తన కార్యక్రమాలను రద్దు చేసుకొని, ప్రతిపక్షం కొనసాగించి ఉంటే సామాజిక మీడియా ఎలా స్పందించి ఉండేది...?

>
మరిన్ని వార్తలు