Sharad Pawar: శరద్ పవార్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

12 Dec, 2023 09:39 IST|Sakshi

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ 83వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. ‘శరద్ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా దేశంలోనే అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేతలలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు ఉన్నప్పటికీ పార్టీలకు  అతీతంగా ఆయన పలువురు నేతలలో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుంటారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 1999లో ఈ పార్టీని స్థాపించారు. 27 ఏళ్ల పిన్నవయసులోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగానూ వ్యవహరించారు.

సోనియా గాంధీ విదేశీయురాలంటూ శరద్‌పవార్‌ వ్యాఖ్యలు చేసిన దరమిలా పార్టీలో చీలికలు రావడంతో ఆయన ఎన్సీపీని స్థాపించారు. ఈ పార్టీ అనతి కాలంలోనే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవలే ఈ ట్యాగ్‌ను కోల్పోయింది. శరద్ పవార్ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన నేత. రాజకీయ వర్గాల్లో ఆయనను చాణక్యుడు అని కూడా పిలుస్తుంటారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల మధ్య కూటమి ఏర్పాటులో శరద్‌పవార్‌  కీలక పాత్ర పోషించారు.
ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు
 

>
మరిన్ని వార్తలు