బీజేపీ ‘మాయాజాలం’

11 Apr, 2019 08:46 IST|Sakshi

మాములు మాటలతో కంటే మాయలు, మంత్రాలతో ఓటర్లను ఆకట్టుకోవచ్చని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లపై మా యాజాలం విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామాల్లో ఇంద్రజాలికుల ద్వారా ప్రదర్శనలు ఇప్పించి ఓటర్లను ఆకట్టుకోవాలని కమలనాథులు నిర్ణయించారు. ఇందుకోసం గుజరాత్‌లో 52 మంది ఇంద్రజాలికుల్ని రంగం లోకి దించారు. 2014 ఎన్నికల్లో ఇలాగే ఇంద్రజాలికులతో ప్రచారం చేయించడం పార్టీకి లాభించిందని భావించిన నాయకత్వం ఈసారి కూడా అదే ప్రయోగం చేస్తోందని బీజేపీ ప్రతినిధి భరత్‌ పాండ్య చెప్పారు.

గుజరాత్‌తో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పిలిపిం చిన ఇంద్రజాలికులు కొన్ని బృందాలుగా విడిపోయి మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారు. ముందుగా మేజిక్‌తో అంటే ఖాళీ కుండ నుంచి కమలం బొమ్మ ఉన్న జెండాను బయటకు తీయడం, ఖాళీ పలకపై మోదీ బొమ్మను సృష్టించడం వంటివి చేస్తారు. ఒకవైపు ఈ ప్రదర్శన జరుగుతోంటే మిగతా వారు బీజేపీ ప్రభుత్వ పథకాలను, హామీలను వివరిస్తుంటారు. అక్కడి అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారు. కాగా, మోదీ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన ప్రజోపయోగ నిర్ణయాలు, పథకాల గురించి ప్రచారం చేసేందుకు 52 ఎల్‌ఈడీ వ్యాన్లను కూడా ఉపయోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు