పాకిస్తాన్‌లోని హిందువులను కాపాడడానికే..

2 Jan, 2020 09:51 IST|Sakshi

లక్నో: మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌పై యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ మండిపడ్డారు. ఎన్‌పీఆర్‌(జాతీయ జనాభా రిజిస్టర్‌), ఎన్‌ఆర్‌సీ(జాతీయ పౌర పట్టిక)లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న అఖిలేష్‌కు పాకిస్తాన్‌లోని హిందువులపై జరుగుతున్న అరాచకాల గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఓ నెల రోజులు నివసించాలని అన్నారు. బుధవారం దేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఎన్‌పీఆర్‌ వల్ల ఎలాంటి నష్టం లేదని, వ్యక్తులకు సంబంధించిన స్ధానికతను తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 

వ్యక్తి స్థానికతను నిర్ధారించేందుకు ఆదార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పొరుగునే ఉన్న ముగ్గురు స్థానికుల నిర్ధారణ మాత్రమే అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా కుటుంబ సభ్యులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అశిలేష్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు సంబంధించి ప్రజలకు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఏఏ పేద ప్రజలకు ఉపయోగపడే చట్టమని..ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలని ప్రియాంకా గాంధీకి సూచించారు. 

పాకిస్తాన్‌లో అరాచకాలకు గురవుతున్న హిందువులను ఆదుకోవడానికి సీఏఏ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ చట్టాల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కృషి అభినందనీయమని కొనియాడారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ..సీఏఏను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, సమాజ్‌వాద్‌ పార్టీ(ఎస్‌పీ), బహుజన్‌ సమాజ్‌వాద్‌ పార్టీలు(బీఎస్‌పీ)లకు ముస్లీం, హిందువులు ఓటేయరని విమర్శించారు. సీఏఏ గురించి అవగాహన పెంచుకోవాలని జేఎన్‌యు విద్యార్థులకు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు సూచించారు. కాగా, పేద ప్రజలు, మైనారిటీలకు వ్యతిరేకంగానే ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ చట్టాలు చేశారంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ గత కొద్దిరోజులుగా బీజేపీని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు