నిజాంను తలపిస్తున్న కేసీఆర్‌ : మురళీధర రావు

11 Jul, 2018 14:34 IST|Sakshi
మురళీధర రావు (ఫైల్‌ ఫోటో)

పరిపూర్ణానంద హైదరాబాద్‌ బహిష్కరణను తీవ్రంగా ఖండిస్తోన్న బీజేపీ

సాక్షి, హైదరాబాద్‌ : స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆరునెలల వరకు నగరంలోకి ప్రవేశించకూడదని నగర పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు బుధవారం ట్వీటర్‌లో స్పందించారు. నిజాం మత రాజకీయాలకు కేసీఆర్‌ ప్రభుత్వ పరిపాలన నిదర్శనమని ధ్వజమెత్తారు. పరిపూర్ణానంద బహిష్కరణ మానవహక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. ఇది యూవత్‌ హిందూ సమాజంపై దాడి అని, ప్రభుత్వం ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పెద్దపీఠ వేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.

ఎమ్‌ఐఎమ్‌ నేతలను బహిష్కరించాలి
పరిపూర్ణానంద నగర బహిష్కరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కోరారు. కోట్లాది ప్రజలు ఆరాధించే శ్రీరాముడిని నిందించిన వారిపై చర్యలేవని, ఈ ప్రభుత్వం ఎవరి చేతిలో నడుస్తోందని ప్రశ్నించారు. ఆయన నగర బహిష్కరణ ప్రభుత్వ కుట్రని అన్నారు. హిందూ దేవుళ్లను తూలనాడిన ఎమ్‌ఐఎమ్‌ నేతలను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. స్వామిజీని బహిష్కరణ చేయడమంటే హిందూవులను బహిష్కరణ చేయడమే అని మండిపడ్డారు. పరిపూర్ణానందపై చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆయపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

బీజేపీ ధర్నా
పరిపర్ణానంద స్వామిని హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో బీజేపీ ధర్నా చేపట్టింది. స్వామిపై వేసిన బహిష్కరణను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

మరిన్ని వార్తలు