‘మెజారిటీ రాదన్నారు..కానీ అబద్ధమని తేలింది’

7 May, 2019 17:36 IST|Sakshi
సాక్షిటీవీతో మురళీధర్‌ రావు(పాత చిత్రం)

ఢిల్లీ: ప్రతిపక్ష కూటమిలోని అసమ్మతి తమకు ప్రయోజనకరంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సాక్షిటీవీతో మురళీధర్‌ రావు మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల్లో మోదీకి మెజారిటీ రాదన్నారు..కానీ అది అబద్ధమని తేలిందని గుర్తు చేశారు. ఈసారి కూడా మోదీ తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా మోదీ పేరు మారుమోగుతుందని పేర్కొన్నారు. సామాజిక సమీకరణాల కాంబినేషన్‌ను మోదీ ఫ్యాక్టర్‌ అధిగమించిందని వ్యాక్యానించారు.

దేశంలో ఎక్కడా కూడా మోదీకి వ్యతిరేకత లేదని చెప్పారు. బీజేపీని మించి మోదీకి పాపులారిటీ వచ్చిందన్న విమర్శల్లో అర్ధం లేదన్నారు. బిడ్డను చూసి తల్లి గర్వపడినట్లుగా.. మోదీని చూసి బీజేపీ గర్విస్తుందని కొనియాడారు. మోదీకి ప్రజాదరణ పెరగడం బీజేపీలో అభద్రత పెంచదని చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజస్తాన్‌లోనూ మంచి సీట్లు సాధిస్తామని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీని రాహుల్‌ గాంధీ శాశ్వతంగా నాశనం చేశారని విమర్శించారు. సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే తమ సొంత సీట్లకే పరిమితం కావాలసి వచ్చిందని చెప్పారు. కర్ణాటకలో గతం కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 110 సీట్లు 
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తున్నారని ప్రముఖ సర్వే సంస్థలు అన్నీ చెబుతున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 110 సీట్లు వచ్చే అవకాశముందన్నారు. చంద్రబాబు నాయుడు మైక్రో మేనేజ్‌మెంట్‌ వల్ల కనీసం పోటీలో నిలబడగలిగారని  చెప్పారు. చంద్రబాబుకు ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసివేశామని అమిత్‌ షా బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనను తిరిగి ఎన్డీయే కూటమిలోకి తీసుకునే అవకాశమే లేదన్నారు. అలాగే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం లేదన్నారు. మోదీ, అమిత్‌ షా కాంబినేషన్‌లో బీజేపీ ఎన్నికల నిర్వహణలో మరింత పదును తేలిందన్నారు.

2014 నుంచి వరసగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం సాధారణ విషయం కాదన్నారు. జాతీయత, అభివృద్ధి, సంక్షేమ పరిపాలన మోదీ త్రిశూల విధానమన్నారు. కులాలకు అతీతంగా ఈ విధానాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారని పొగిడారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి అత్యధిక సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ వ్యతిరేకత శూన్యతను బీజేపీ పూరిస్తుందన్నారు. తెలంగాణలో 5 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ తెలంగాణాల్లో జరిగే నష్టాన్ని తమిళనాడుతో భర్తీ చేస్తామన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్యను రాహుల్‌ గాంధీ ఇంట్లో కూర్చోబెట్టడం ద్వారా బీజేపీకి బాగా లబ్ధి చేకూరిందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు