రాజీవ్‌ గాంధీపై మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నేత 

9 May, 2019 10:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిలో నంబర్‌ వన్‌ (భ్రష్టాచారి నెంబర్ వన్) అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా తాజాగా సొంత పార్టీ నుంచి కూడా మోదీకి విమర్శలు ఎదురవుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ ఖండించారు. రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా చనిపోలేదని, ఎల్‌టీటీఈ ఆత్మహుతి దాడిలో చనిపోయారని, ఈ విషయం దేశ ప్రజలందరికి తెలుసని శ్రీనివాస్‌ అన్నారు.

బీజేపీ సీనియర్‌ నేత శ్రీనివాస ప్రసాద్‌

‘రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ చంపేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. ఇటువంటి ఆరోపణలను ఎవరూ నమ్మరు. చివరికి నేను కూడా నమ్మను. మోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. రాజీవ్ చాలా చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారంటూ వాజ్‌పేయి లాంటి గొప్ప నాయకులే పొగిడారని శ్రీనివాస్‌ గుర్తు చేశారు.శ్రీనివాస ప్రసాద్‌ 6 సార్లు ఎంపీగా, వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా,ఒకసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 

మరిన్ని వార్తలు