నిద్రపోతున్న నిఘా నేత్రం | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్న నిఘా నేత్రం

Published Thu, May 9 2019 10:40 AM

CC Cameras Not Working In Bus Stop And Cinema Halls Nizamabad - Sakshi

నిజామాబాద్‌ నాగారం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో నిఘా నేత్రం నిద్రపోతోంది. పేరుకే సీసీ కెమెరాలు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఏ రోజు కూడా అవి పనిచేసిన దాఖలాలు లేవు. మరోవైపు బస్టాండ్‌లో దొంగలు రాజ్యమేలుతున్నారు. బస్టాండ్‌లో పోలీస్‌ బూత్‌ ఉన్నా అక్కడ పోలీసులే కనిపించారు. ఈ బస్టాండ్‌ ద్వారా ప్రతిరోజు సుమారు 80 వేల నుంచి లక్ష వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. బస్టాండ్‌లో సుమారు 60 పైగా దుకాణాల సముదాయాలు ఉన్నాయి.

బస్టాండ్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం బస్టాండ్‌లో సుమారు ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు మాత్రమే ఇవి పనిచేశాయి. ఆ తర్వాత మానేశాయి. సీసీ కెమెరాలను మానిటరింగ్‌ చేసే కంప్యూటర్‌ సిస్టం సక్రమంగా పని చేయడం లేదు. బస్టాండ్‌లో ఒక పక్క చోరీలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్నారని వివర్శలు వస్తున్నాయి.

బస్టాండ్‌లోనే కాకుండా ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలోనూ పర్సులు, డబ్బులు, బంగారం చైన్‌లను దొంగలు కొట్టేస్తున్నారు. రూ. వేలు విలువ చేసే స్మార్ట్‌ఫోన్‌లను సైతం మాయం చేస్తున్నారు.బాధిత ప్రయాణికులు లబోదిబో మంటూ బస్టాండ్‌లో õఉన్న పోలీస్‌బూత్‌ దగ్గరకు వెళ్తే అక్కడ ఎవరూ ఉండటం లేదు. దీంతో బస్‌స్టేషన్‌మాష్టార్‌ కార్యాలయంలోకి వెళ్తే  తమకేమీ తెలియని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారు. 

రక్షణ లేకుండా పోయింది 
బస్టాండ్‌లో వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ప్రయాణికుల భద్రత పట్ల కనీస చర్యలు తీసుకోవడం లేదు. బస్టాండ్‌లో చాలా మంది ప్రయాణికులు చోరీలకు గురవుతూనే ఉన్నారు. మా బంధువులు సైతం బస్టాండ్‌లో ఉండగానే చోరీకి గురయ్యారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. –భోజన్న, ప్రయాణికుడు   

సెల్‌ఫోన్, పర్సుపోయింది 
మా స్నేహితులతో కలిసి బస్సుఎక్కుతున్న సమయంలో పర్సు, విలువైన సెల్‌ఫోన్‌ చోరీకీ గురైంది. ఈ విషయంలో సంబంధిత స్టేషన్‌ మాష్టార్‌కు చెబితే వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని సలహా ఇచ్చారు.  సీసీ కెమెరాలు పనిస్తే చాలా వరకు దొంగతనాలను అరికట్టవచ్చు.  –కిషోర్, ప్రయాణికుడు 

Advertisement
Advertisement