కేశినేని నానిపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్‌

7 Aug, 2019 14:26 IST|Sakshi

ట్విటర్‌ ద్వారా చిల్లర ప్రచారం పొందుతున్నారని విమర్శ

సాక్షి, విజయవాడ : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతిని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దేశ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆర్టికల్‌ 370 రద్దు బిల్లుకు టీడీపీ పార్లమెంటులో మద్దతు ఇచ్చిందని అన్నారు. అయితే, ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అసహనం వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ట్విటర్‌ ద్వారా నాని చిల్లర ప్రచారం పొందుతున్నారని ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌ రాజకీయాలు ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు.

ఆర్థికంగా చితికిపోయిన కేశినేని ఏం​ మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. బెజవాడ ప్రజలు ఆయనను ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నామా అని సిగ్గుపడుతున్నారని అన్నారు. సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ పాకిస్తాన్‌ ఏజెంట్లలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ వేస్తున్న బిస్కట్ల కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారని చురకలంటించారు. పాకిస్తాన్‌, చైనాకు మద్దతుగా మాట్లాడే కమ్యూనిస్టులు దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు