యూపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం

18 Dec, 2019 15:10 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన కొందరు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. వీరికి ప్రతిపక్ష సభ్యులు కూడా మద్దతుగా నిలవడంతో సభలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్‌ మంగళవారం రోజున యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తనను ప్రభుత్వ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే కిషోర్‌ ప్రసంగానికి స్పీకర్‌ హృదయ్‌ నారాయణ్‌ అడ్డుతగిలారు. ఈ అంశంపై తర్వాత చర్చ చేపట్టాలని సూచించారు. అయితే కిషోర్‌తో పాటు మరికొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఈ అంశంపై వెంటనే చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. సభలో నిరసనకు దిగారు.

వీరికి ఎస్పీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా నిలిచారు. వెల్‌లోకి దూసుకెళ్లి కిశోర్‌కు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఈ నిరసనల మధ్య స్పీకర్‌ సభను వాయిదా వేశారు. అయినప్పటికీ పలువురు బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభలో నుంచి బయటకి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో రంగంలోకి దిగిన సీనియర్‌ మంత్రులు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కిషోర్‌ను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోకుంటే మళ్లీ నిరసన చేపడతామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

మరోవైపు కిషోర్‌కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌ ప్రకాశ్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. హోంగార్డుల నుంచి ఐపీఎస్‌ల వరకు, ప్యూన్‌ల నుంచి ఐఏఎస్‌ అధికారుల వరకు.. ఇలా ప్రతి ఒక్కొరికి యూనియన్‌లు ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే శాసన సభ్యులు తమ హక్కులను పరిరక్షించుకునేందుకు యూనియన్‌ ఏర్పరుచుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయాలు.. ఎమ్మెల్యేలను బలహీన పరిచేలా ఉన్నాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు