బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడిది..?

22 May, 2018 09:52 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ (పాత ఫొటో)

చంద్రబాబు సర్కారుపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌

సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పవిత్రతను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అపవిత్రం చేస్తోందంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన... టీడీపీ నాయకులు, అధికారులు వరుసగా ప్రెస్‌ మీట్లు పెట్టి మరీ రమణ దీక్షితులును విమర్శిస్తున్నారంటే ఏదో తప్పు జరిగేవుంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

అనేక ఆరోపణలు కలిగిన వ్యక్తులను టీటీడీ చైర్మన్‌గా నియమించారన్న మాధవ్‌.. టీటీడీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ హయాంలో ధార్మిక మండలిని ఏర్పాటు చేశారని.. అయితే ప్రస్తుతం ధార్మిక మండలిని లేకుండా చేసి బాబు సర్కారు అవినీతికి పాల్పడుతోందంటూ ఆయన ఆరోపించారు.

బాబుకు పుట్టగతులు ఉండవు..
కోట్లాది మంది భక్తుల ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే చంద్రబాబుకు పుట్టగతులు ఉండవని మాధవ్‌ మండిపడ్డారు. స్వామి వారి ఆభరణాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆభరణాలన్నీ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఈవో చెబుతున్నారని.. అయితే ఆయనే స్వయంగా వాటిని చూశారా? లేదా ఇలా చెప్పడంలో ఆయనపై ఎవరి ప్రభావమైనా ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ఆ దేశం వివరణ కోరాల్సిన అవసరముం‍దని వ్యాఖ్యానించారు. 

తాంత్రిక పూజలపై కూడా..
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ మాధవ్‌ విమర్శించారు. చంద్రబాబు నాయుడు టీటీడీని టీడీపీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. 65 సంవత్సరాల వయసు బూచిని చూపుతూ ప్రభుత్వం అర్చకులపై కక్ష సాధిస్తోందన్నారు. టీటీడీ వ్యవహారంతో పాటు.. దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు