బీజేపీ విజయానికి కారణాలేమిటీ?

18 Dec, 2017 13:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచిన్పటికీ, రిజర్వేషన్ల అంశంపై పాటిదార్లు దూరం అయినప్పటికీ ఫలితాల్లో మాత్రం పాలకపక్ష భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోవడం ఆశ్చర్యకరమైన పరిణామమే. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయం వరించడం అంటే విశేషమే. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మూడేళ్లలో ఎలాంటి కొత్త ఉద్యోగాలు యువతకు కల్పించకపోయినప్పటికీ, గుజరాత్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రమైనప్పటికీ బీజేపీకి ప్రజలు పట్టంగట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి బీజేపీ విజయానికి దారితీసిన అంశాలేమిటీ?

‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ నినాదంతో మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రచారం ప్రజలపై పెద్దగా ప్రభావం చూపినట్లు కనిపించలేదు. విశ్వసించతగ్గ  సీఎస్‌డీఎస్‌–లోక్‌నీతి డిసెంబర్‌ ఐదవ తేదీన విడుదల చేసిన సర్వేలో పాలకపక్ష బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు చెరి 43 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించడమే అందుకు తార్కాణం. ఆ తర్వాత ఇదే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ 49 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని, 43 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ వెనకబడి పోతుందని తేలింది. ఇంతలో ఇంత మార్పునకు కారణాలేమిటీ?

అభివృద్ధి నినాదానికి ప్రజలు అంతగా ప్రభావితం కావడం లేదని గ్రహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చివరి ఘట్టంలో హిందూత్వ ఎజెండా అందుకున్నారు. జాతీయవాదాన్ని తీసుకొచ్చారు. తనను అడ్డు తొలగించేందుకు మణిశంకర్‌ అయ్యర్‌ పాకిస్థాన్‌కు వెళ్లి సుఫారీ ఇచ్చి వచ్చారని ఆరోపించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ గుజరాత్‌ ఎన్నికలపై పాక్‌ నాయకులతో కుట్ర పన్నారని, అందుకు ఓ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారని విమర్శలు చేశారు. రాష్ట్ర ఓటరుపై ఈ అంశాలే ప్రధానంగా ప్రభావం చూపించి ఉంటాయి. లేకపోయినట్లయితే పాలకపక్ష బీజేపీకి అనుకూలించే ఇతర అంశాలేమీ కనిపించడం లేదు.

కాంగ్రెస్‌ పార్టీ 60 ఏళ్ల పాలనతో దేశాన్ని దిగజార్చిందని, తనకు 60 నెలల గడువిస్తే చాలు దేశాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళతానంటూ, అచ్చేదిన్‌ నినాదంతో నరేంద్ర మోదీ 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటికే యూపీఏ ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో పీకలదాకా కూరుకుపోయి ఉండడం, మన్మోహన్‌ సింగ్‌ కీలుబొమ్మ ప్రధానిగా ముద్ర పడటం కూడా ప్రధానంగా మోదీ విజయానికి కలసివచ్చాయి. అధికారంలోకి వచ్చాన ఆయన ఏటా కోటి ఉద్యోగాల హామీని నెరవేర్చలేకపోయారు. ‘అచ్చేదిన్‌’ కనుచూపు మేరలో కనిపించడం లేదు. పైగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి వివాదాస్పద నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత భావాన్నే పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 2019లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా గుజరాత్‌ ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో హిందూ ఎజెండానే జెండాగా ఎత్తుకునే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు