అమిత్‌ షా ర్యాలీలో గోలీమారో నినాదాలు..

1 Mar, 2020 18:51 IST|Sakshi

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో కొందరు ఆ పార్టీ కార్యకర్తలు ‘గోలీమారో’ నినాదాలు చేయడం కలకలం రేపింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  ఆదివారం కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. అమిత్‌ షా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో గోలీమారో నినాదాలు చేయడం గమనార్హం. బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో తొలుత కార్యకర్తలు భారత్ మాతాకీ జై, జై శ్రీరాం నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. (సీఏఏ రగడ : దీదీపై అమిత్‌ షా ఫైర్‌)

అయితే అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాల పరిసర ప్రాంతాల్లోకి రాగానే బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వారు సమీపంలోకి రాగానే ‘గోలీమారో... గోలీమారో’ నినాదాలను చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఎవరు ఆ నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. (రాజ్యసభకు ప్రశాంత్‌ కిషోర్‌..!)

కాగా గోలీమారో నినాదాలు చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హింసను ప్రేరేపించే విధంగా బీజేపీ నేతలు... కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేసినా సరే, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నాయి. గోలీమారో నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని బెంగాల్‌ సీపీఎం శాఖ డిమాండ్ చేసింది. కాగా ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గోలీమారో నినాదాలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు