గురుదాస్‌పూర్‌ ‘బోర్డర్‌’ వార్‌!

18 May, 2019 05:17 IST|Sakshi
సన్నీదేవల్‌, సునీల్‌ జాఖఢ్‌

సన్నీ దేవల్‌ వర్సెస్‌ సునీల్‌ జాఖఢ్‌

సరిహద్దుల్లో దేశభద్రతకోసం సాహసోపేతంగా పోరాడిన సినీ హీరో ఇప్పుడు రాజకీయ బరిలో నిజమైన సమరాన్ని ఎదుర్కోబోతున్నారు. ‘బోర్డర్‌’, ‘గదర్‌ –ఏక్‌ ప్రేమ్‌కథా’ లాంటి చిత్రాల హీరో సన్నీదేవల్‌ను ఓటర్లు గెలిపిస్తారా? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో నాలుగు సార్లు విజయం సాధించిన మరో బాలీవుడ్‌ నటుడు వినోద్‌ఖన్నా మరణంతో 2017లో జరిగిన ఉప ఎన్నికలో ఈ సీటుని బీజేపీ నుంచి కాంగ్రెస్‌ కైవసం చేసుకోగలిగింది. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్‌ బలరాం జాఖఢ్‌ కొడుకు సునీల్‌ జాఖఢ్‌ 1,90,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కి చెక్‌పెట్టేందుకు బీజేపీ సినీరంగ ప్రముఖుడైన 62 ఏళ్ళ సన్నీదేవల్‌ను బరిలోకి దింపింది. బీజేపీ టికెట్‌పై పోటీచేసిన వినోద్‌ ఖన్నాను అభివృద్ధి ఎజెండా నాలుగుసార్లు ఈ స్థానంలో గెలుపుని ప్రసాదించింది. ఈ ప్రాంతంలో విస్తృతంగా వంతెన నిర్మాణాలు చేపట్టడంతో వినోద్‌కి ‘పూలోంకా బాద్షా’ అనే పేరు తెచ్చిపెట్టింది. బీజేపీ తన పూర్వ వైభవం సంపాదించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది.  

అయితే గురుదాస్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో జాట్ల జనాభా ఎక్కువ. ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జాఖడ్, అటు బీజేపీ సినీదిగ్గజం ధర్మేంద్ర కొడుకు  సన్నీదేవల్‌ ఇరువురూ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది 23 వరకు వేచి చూడాల్సి ఉంది. గురుదాస్‌పూర్‌లో తనను తాను దేశభక్తుడిగా ప్రచారం చేసుకునే సన్నీదేవల్‌పై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. రాజకీయ నేతగా మారిన  సన్నీదేవల్‌ ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. సమయం అతి తక్కువగా ఉండడంతో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేయడం అంత సులువైన విషయమేమీ కాదని భావిస్తున్నారు. అందుకే ప్రతిరోజూ 12 గంటలపాటు నిర్విరామంగా రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు.

సన్నీదేవల్‌ బీజేపీ జాతీయవాదాన్ని సినిమాఫక్కీలో ప్రచారంచేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. సన్నీ సందర్భోచిత సినీడైలాగులతో ఓటర్లును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  1993లో యువతరాన్ని ఉర్రూతలూగించిన ‘దామిని’ సినిమాలోని ‘ఏ ఢాయీ కిలోకా హాత్‌’ డైలాగులనీ, ‘గదర్‌’ సినిమాలోని ‘ఏ హిందుస్థాన్‌ జిందాబాద్‌ హై, జిందాబాద్‌ రహేగా’’ అనే డైలాగునీ అదే సినీఫక్కీలో వినిపిస్తోన్న సన్నీదేవల్‌ ప్రచారాన్ని ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. చివరకు నరేంద్రమోదీ కూడా సన్నీదేవల్‌ ఫొటోతో ‘‘హిందుస్థాన్‌ జిందాబాద్‌...’’ అంటూ ట్వీట్‌ చేయడం విశేషం. అలాగే సన్నీదేవల్‌ తండ్రి ధర్మేంద్ర ప్రచారం సైతం బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు.  

అయితే స్థానికేతరుడంటూ ప్రత్యర్థుల విమర్శలనెదుర్కొంటున్న సన్నీదేవల్‌కి స్థానిక సమస్యలు తెలియకపోవడం వల్ల సినీ డైలాగులు తప్ప ప్రజాసమస్యల ప్రస్తావన ఆయన ప్రచారంలో కొరవడిందన్న విమర్శలు వెంటాడుతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, రైతాంగానికి రుణమాఫీ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ప్రధానంగా చెరకు రైతులకు గత పంటలకాలంలో చెల్లించాల్సిన  85 కోట్లరూపాయల చక్కెర మిల్లుల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘‘ బీజేపీ జాతీయవాదం తమకు ఉపాధి కల్పించలేదు. కానీ కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం, అభివృద్ధీ ఆ పని చేయగలుగుతుంది’’ అని 2017లో ఉపాధి కోల్పోయిన స్థానిక యువకుడు జగ్‌రాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. సిట్టింగ్‌ ఎంపీ సునీల్‌ జాఖడ్‌పై ఈ ప్రాంత ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలున్నాయి. దానికి తోడు స్థానికంగా అక్రమ మైనింగ్‌ ఆరోపణలు సైతం ఆయన ఎదుర్కొంటుండడం సన్నీదేవల్‌కి కలిసొచ్చే అంశమని విశ్లేషకుల అంచనా.

మరిన్ని వార్తలు