పంజా విసిరేదెవరు?

18 May, 2019 05:48 IST|Sakshi

సరిహద్దు ఉద్రిక్తతలు ప్రభావం చూపిస్తాయా? 

విపక్షాల్లో అంతర్గత పోరు

కాంగ్రెస్‌కు లాభిస్తుందా ? 

కాంగ్రెస్, ఎస్‌ఏడీ–బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా తక్కువగా ఉన్న రాష్ట్రం పంజాబ్‌ ఒక్కటే. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో జూనియర్‌ ప్లేయర్‌ మాత్రమే. మొత్తం 13 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ మూడు సీట్లలోనే పోటీచేస్తోంది. మిగిలిన 10 సీట్లలో ఎస్‌ఏడీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. పాకిస్తాన్‌కు సరిహద్దు రాష్ట్రంగా ఉండడంతో అక్కడ విభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా దాడులు అక్కడ ఎన్నికల అంశమే కాదు. ఎందుకంటే పాకిస్తాన్‌తో పంజాబీ ప్రజలెవరూ యుద్ధం కోరుకోవడం లేదు. శాంతి మంత్రాన్నే వారు జపిస్తున్నారు. పొరుగు దేశంతో యుద్ధం వస్తే పంజాబ్‌ మీదే అత్యధిక ప్రభావం కనబడుతుంది. అందుకే ఈ సారి మోదీ రూటు మార్చారు.

ప్రచారంలో జాతీయ భద్రత అంశాలను పక్కన పెట్టి రాజీవ్‌గాంధీ నం.1 అవినీతిపరుడని, సిక్కుల ఊచకోత అంశాన్ని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం ఎస్‌ఏడీ–బీజేపీ కూటమి నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ హయాంలో పాలనపరమైన లోపాలు ఎంచడానికి పెద్దగా ఏం లేవు. దీంతో ఇక్కడ కాంగ్రెస్, ఎస్‌ఏడీ–బీజేపీ మధ్యే హోరాహోరి పోరు నెలకొంది. ఎస్‌ఏడీలో చీలికలు ఆ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఖదూర్‌ సాహిబ్‌ ఎంపీ రంజిత్‌సింగ్‌ బ్రహ్మపుర, మాజీ ఎంపీ రతన్‌ సింగ్‌ అజనాల, మాజీ మంత్రి సేవా సింగ్‌ షెఖ్‌వాన్‌తో కలిసి శిరోమణి అకాలీ దళ్‌ (తక్సాలీ) పేరుతో కొత్త పార్టీ పెట్టి సిక్కు ఓటర్లను ప్రభావితం చేయడానికి తమ వంతు ప్రయత్నాలు విస్తృతంగా చేసింది.

అంతర్గత పోరుతో ఆప్‌ సతమతం  
గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ సారి అంతర్గత పోరాటంతో సతమతమవుతూ చతికిలపడిపోయింది. పార్టీలో అంతర్గతంగా అసమ్మతి సెగలు, బహిరంగంగా తిరుగుబాట్లు ఆ పార్టీని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. గత ఏడాది ఆప్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా నేతృత్వంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు పంజాబ్‌ ఏక్తా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టారు. మరో నాలుగు పార్టీలతో కలిసి వారు ఈ సారి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సారి ఆప్‌ పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. సంగ్రూర్‌లో సిట్టింగ్‌ ఎంపీ భగవత్‌ మన్‌పై మాత్రమే ఆప్‌ ఆశలు పెట్టుకుంది. మొత్తమ్మీద ప్రధాన ప్రతిపక్షాల్లో అంతర్గత పోరే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వరంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

పంజాబ్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ ప్రభావం ఎంత ?  
బీఎస్పీ, సీపీఐ, పంజాబ్‌ ఏక్తా పార్టీ, లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ, పంజాబ్‌ ఫ్రంట్‌ అండ్‌ రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీలు కలిసి పంజాబ్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ పేరుతో కొత్త కూటమిగా ఏర్పడ్డాయి. ఈ పార్టీ అ«భ్యర్థులు ఇల్లిల్లు తిరుగుతూ కొత్త తరహాలో ప్రచారం చేశారు. పంచకుల హింసపై విచారణతో పాటు గంజాయి సాగుని చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌తో భిన్న తరహాలో ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు.  ఈ పార్టీలకు సీట్లు గెలుచుకునే అవకాశాలు లేనప్పటికీ, ఎవరి ఓటు బ్యాంకు ఎంత చీలుస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది.  

ఎన్నికల అంశాలు రైతు ఆత్మహత్యలు
పంజాబ్‌ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం. మొత్తం 10.5 లక్షల కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. సగటున రోజుకి ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు.  

నిరుద్యోగం
భారత్‌లో సగటు నిరుద్యోగం రేటు 10.2%గా ఉంటే పంజాబ్‌లో 16శాతంగా ఉంది. ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి పెడదారిన పడుతున్నారు. 

సరిహద్దు ఉద్రిక్తతలు
పుల్వామా దాడుల అనంతరం పాక్‌కి అత్యంత సానుకూల దేశం హోదాని భారత్‌ తొలగించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. కొన్ని వందల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.  

డ్రగ్స్‌ మాఫియా
పంజాబ్‌ పేరు వింటేనే డ్రగ్స్‌ మాఫియా గుర్తుకొస్తుంది. మార్కెట్లోకి కృత్రిమ డ్రగ్స్‌ ప్రవేశించి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మాదకద్రవ్యాలు సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. సగటున ఏడాదికి 60 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గంజాయి సాగుని చట్టబద్ధం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పంచకుల కాల్పులు
ఇద్దరు సా«ధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత రాం రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేల్చిన నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం పంజాబ్‌ రాష్ట్రం అట్టుడికింది. గుర్మీత్‌ సింగ్‌ అనుచరులు వీరంగం సృష్టించారు.ఈ సందర్భంగా చెలరేగిన హింసలో వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారుల్ని అదుపు చెయ్యడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో కూడా కొందరు చనిపోయారు.  

మొత్తం నియోజకవర్గాలు : 13
గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఖదూర్‌ సాహిబ్, జలంధర్, హోషియార్‌పూర్, ఆనందపూర్‌ సాహిబ్, లూదియానా, ఫతేగఢ్‌ సాహిబ్, ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్, భటిండా, సంగ్రూర్, పాటియాలా
 ఓటర్ల సంఖ్య: 2.03 కోట్లు  

 

>
మరిన్ని వార్తలు