ధర్మపోరాటమంటూ అధర్మంగా వ్యవహరిస్తున్నారు

23 May, 2018 03:43 IST|Sakshi

     ప్రభుత్వ ధనంతో ధర్మపోరాట సభ 

     వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: ధర్మపోరాటమంటూ సీఎం చంద్రబాబు అధర్మంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు చేస్తున్న అధర్మాలకు లెక్కేలేదని, అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, దేవదాయ శాఖకు చెందిన భూములను తనవారికి కట్టబెట్టి నేడు ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉండి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వల్లే లాభాలు అధికమని ప్రజలకు చెప్పిన బాబు నేడు హోదా కోసం పోరాటం చేస్తున్నానని చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ధర్మం అనే పదం పలకడానికి కూడా బాబుకు అర్హత లేదన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుపై మాట్లాడుతున్నారని, కానీ రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలతో ఎలా బేరసారాలు ఆడారని ప్రశ్నించారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసుపై విచారణ వేగంగా జరగాలని డిమాండ్‌ చేశారు.  సమావేశంలో మల్లాది విష్ణు, కావటి మనోహర్‌ నాయుడు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు