అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది

30 Oct, 2019 04:49 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి బొత్స చిత్రంలో సజ్జల, మంత్రులు సుచరిత, వెలంపల్లి, తదితరులు

ఈ మేరకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే సీఎం నిర్ణయం తీసుకున్నారు 

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 13 లక్షల మంది బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం సంక్షోభం నుంచి పరిష్కారాన్ని వెతికారని తెలిపారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం జరిగింది. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులందరికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని.. దీనివల్ల 65 శాతం మందికి న్యాయం జరుగుతుందన్నారు.

మాట ప్రకారం బాధితులను ఆదుకున్నారు: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయం చేస్తారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం బాధితులను సీఎం ఆదుకున్నారన్నారు. బాధితులకు చెల్లించడానికి రూ. 1,150 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా చెల్లించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

ప్రైవేటు సంస్థ మోసం చేస్తే బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ కేసులను సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. ఒక్క బాధితుడికి కూడా చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల బాధితులు సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారన్నారు. 

మరిన్ని వార్తలు