‘ఒకేసారి 3 వేలు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు’

18 Jun, 2019 12:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : వృద్ధాప్య పెన్షన్‌ను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వృద్ధాప్య పెన్షన్‌ను ఒకేసారి రూ.3 వేలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు చెప్పలేదన్నారు. రూ. 2వేల నుంచి రూ.3 వేల వరకు దశలవారిగా పెంచుకుంటూ పోతామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలన్ని కచ్చితంగా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. 


రాజధానిలో టీడీపీ ఏం చేసింది? : బుగ్గన 
ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి ఏమి చేయలని టీడీపీ నేతలు ఇప్పుడు రాజధాని గురించి గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణానికి టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. అన్ని టెంపరనీ బిల్డింగులే తప్ప ఒక్కటి కూడా పర్మినెంట్‌ బిల్డింగ్‌ నిర్మించలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం టీడీపీలాగా ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మోసం చేయమన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజా మేనిఫెస్టో అమలే వృద్ధిరేటు అన్నారు. మేనిఫెస్టోలో చేస్తామన్న కార్యక్రమాలన్ని చేసి చూపిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు