రాజధాని మార్పు ఆలస్యం కాదు : బొత్స

29 Jan, 2020 15:51 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంపై చంద్రబాబు నాయుడు తన ఎల్లో మీడియాతో దుష్ప్రచారం చేయిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎల్లో మీడియా అనుకున్నట్లు రాజధాని మార్పు ఆలస్యం కాదని  స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోస్టన్‌, జీఎన్‌రావు కమిటీ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించాకే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీఎన్‌ రావు కమిటీని పనికిమాలిన కమిటీ అన్న చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు   జీఎన్‌ రావు కమిటీ వైజాగ్‌లో ప్రకృతి వైపరిత్యాలు వస్తాయని చెప్పిందంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఎల్లో మీడియాతో ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. 

జీఎన్‌ రావు కమిటీ నివేదికను చెత్త బుట్టలో పడేయాలని చెప్పిన చంద్రబాబుకు, ఆయన ఎల్లోమీడియాకు ఇప్పుడు అది భగవద్గీతగా మారిందని విమర్శించారు. ఏ అంశంపై కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు యూటర్న్‌ తీసుకుంటారని, అందుకే ఆయనను యూటర్న్‌ బాబు అంటారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. అన్ని కమిటీల నివేదికలను హైపవర్‌ కమిటీలో చర్చించాకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. శాసన మండలి రద్దుకు రాజధానికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏమి లేకపోవడంతోనే రాజధాని అంశంపై వివాదం చేస్తున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు