వారిలో సమాజ హితం లేదు

10 Jan, 2020 05:33 IST|Sakshi

ఎన్నికలకు ముందొక వార్తలు, ఆ తరువాత మరోలా వార్తలా?

ఇప్పుడున్నవి తాత్కాలిక భవనాలు కాదా?

అన్ని హంగులుంటే రాజధానికి రూ.1.09 లక్షల కోట్లు అవసరమని అప్పుడెందుకు రాశారు?

‘రియల్‌’కు వంత పాడకండి మరి విజయవాడ, విశాఖకు దూరం కాదా?

ఈనాడు, ఈటీవీపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే రాష్ట్రంలోని కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. వారి రాతల్లో,  ప్రసారాల్లో ఏమాత్రం సమాజ హితంలేదని, సొంత సామాజికవర్గ స్ఫూర్తి మాత్రమే కనిపిస్తోందని ఈనాడు, ఈటీవీపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

2020 జనవరి 9న ఈనాడు పత్రిక ‘ఇవి మీకు తెలుసా?’ అనే శీర్షికన ప్రచురించిన ఫొటోలు, కథనాల్లో రామోజీరావు తాలూకు స్వార్థం, సామాజికవర్గ స్ఫూర్తి కనిపిస్తోందన్నారు. ఆ ఫొటోలను మంత్రి ఉటంకిస్తూ.. 2016 అక్టోబర్‌ నుంచి సచివాలయంలో పాలన సాగుతోందని.. 2017 మార్చి నుంచి శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయని రాశారన్నారు. అయితే, అవి జరుగుతున్నవి తాత్కాలిక భవనాల్లో అనే విషయం వాస్తవమా, కాదా? అని రామోజీరావును చెప్పమనండి? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో 2019 జూలై నుంచి రాజ్‌భవన్‌ పనిచేస్తోందని, జగన్‌ అధికారంలోకి వచ్చాక గతంలో మాజీ ముఖ్యమంత్రి వినియోగించిన ఈ భవనాన్ని ఆయనకు కేటాయించారన్నారు.

అంతేకాదు.. విజయవాడ, గుంటూరులో అద్దె భవనాల్లో కొన్ని, సొంత భవనాల్లో కొన్ని ప్రభుత్వ శాఖలున్నాయనేది కూడా నిజమేననీ.. అయితే హంగులన్నీ ఉన్న అమరావతికి అదనంగా ఖర్చుచేయాల్సిన అవసరంలేదని మరో పెద్ద శీర్షికతో కథనం రాసిందని ఆయన ప్రస్తావించారు. అమరావతిలో అన్ని హంగులూ ఉంటే రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు అవుతుందని ఇదే ఈనాడు పత్రిక 2018 డిసెంబర్‌ 24న ‘నిలువెత్తు దగా’ అని వార్త ఎలా రాశారన్నారు. నిజంగా అంతా అయిపోయి ఉంటే మొన్నటి ఎన్నికలకు ముందు రూ.53 వేల కోట్ల మేరకు టెండర్లు ఎందుకు పిలిచారో చెప్పాలి? అన్నారు. అలాగే, గురువారం 2020 జనవరి 9 నాటి కథనంలో రూ.3 వేల కోట్లు ఖర్చుచేస్తే అంతా అయిపోతుందని రాశారని బొత్స అన్నారు. ఎన్నికలకు ముందేమో దగా అని రాసి ఇప్పుడేమో అద్భుతం అంటారా? అని ఆయన విస్మయం వ్యక్తంచేశారు.

శివరామకృష్ణన్‌ నివేదికను ప్రచురించాలి
రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో ఈనాడులో ప్రచురించాలని బొత్స డిమాండ్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి వంత పాడొద్దని రామోజీరావుకు ఆయన హితవు పలికారు.  కాగా, విశాఖపట్నానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు దూరం, దగ్గరని రాస్తున్నారని.. మరి విశాఖపట్నం విజయవాడకు 400 కిలోమీటర్లు ఉన్నపుడు విజయవాడ నుంచి విశాఖ ఏమైనా 40 కిలోమీటర్లే ఉంటుందా? దూరం కాదా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న వారు మనుషులు కారా? వారికి అభివృద్ధి అవసరంలేదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి ఏం చేశారని రామోజీరావు ఏనాడూ తన పత్రికలో ఎందుకు అడగలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాంతీయ అసమానతలను తగ్గించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్‌ వార్తలకు తాము భయపడేదేలేదని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.

పవన్‌కు కోపం వస్తే కవాతు అంటే ఎలా?
కాగా, రాజధాని ప్రాంతంలో పవన్‌కళ్యాణ్‌ చేస్తానని చెబుతున్న నిరసన కవాతు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆయనకు కోపం వచ్చినపుడు కవాతు అంటే ఎలా? ఆయన మాదిరిగా మాకు కేకలు వేయడం, యాక్షన్‌ చేయడం రాదు’ అని బొత్స బదులిచ్చారు. అసలు ఆయనకు ఏ విషయంపై కూడా స్పష్టతలేదన్నారు. రైతులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దని, గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టంచేశారు.  

ఎన్ని గొంతుకలో?
ఈనాడు పత్రిక ఎన్నికలకు ముందు ఒక గొంతుక, ఎన్నికలయ్యాక మరో గొంతుకను వినిపిస్తోందని బొత్స ధ్వజమెత్తారు. రామోజీరావులో సమాజ స్పృహ కన్నా సామాజికవర్గ స్పృహ ఎక్కువగా ఉందని.. ఎందుకీ పాపపు మాటలని ప్రశ్నించారు. వయస్సు, అనుభవం పెరిగిన ఆయన ఇంకా ఏం సాధించడానికి ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. వీరి వ్యవహారం చూస్తుంటే.. వారి మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలా వార్తలు.. మరొకరు సీఎం అయితే ఇంకోలా రాస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులందరూ మీ అడుగులకు మడుగులు ఒత్తాలా? మీకు తొత్తులుగా ఉండాలా? అని ఆయన మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు