అప్పు చేయడం గొప్పా బాబూ!?

20 Aug, 2018 03:28 IST|Sakshi

     అమరావతి బాండ్ల సేకరణ అంటే అప్పు చేయడమే కదా!

     దేశంలోనే అధిక వడ్డీలిచ్చి అప్పులు చేయడం ఘనమా?

     రూ.2.5లక్షల కోట్లతో అప్పుల ఊబిలో ఏపీ

     ప్రతి ఇంటిపై సగటున రూ.2.5 లక్షల రుణభారం

     అప్పునకు గ్రాంటుకు తేడా తెలియని లోకేష్‌

     బాండ్ల లోగుట్టును బహిరంగపర్చాలి

     పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అధిక వడ్డీలిచ్చి అమరావతి బాండ్లను సేకరించడం తమ ఘనకార్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ జబ్బలు చరుచుకోవడం విడ్డూరంగా ఉందని, అప్పులు చేయడం కూడా ఒక గొప్పే అన్నట్లుగా ట్వీట్లు చేస్తున్నారని రాష్ట్ర శాసనసభ పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో ఇతర రాష్ట్రాలు జారీచేసిన బాండ్లను పరిశీలిస్తే.. ఏ రాష్ట్రమైనా పది శాతానికి లోపు మాత్రమే వడ్డీ ఇచ్చాయన్న విషయం తెలుస్తుందన్నారు. తాజాగా.. దేశంలో జారీ అయిన బాండ్ల సంఖ్య 194 అయితే.. అందులో ప్రైవేటు రంగానికి చెందినవి కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే పది శాతం చొప్పున వడ్డీని నిర్ధారించాయన్నారు. విసు లీజింగ్‌ అండ్‌ ఫైనాన్స్, ఎస్కే ఫైన్‌కాప్, అల్టికో కేపిటల్, మరో కంపెనీ మాత్రమే పది శాతం వడ్డీని ఇవ్వగలుగుతున్నాయన్నారు. ఇదేదో దేశంలో మరెక్కడా లేని విధంగా బాండ్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, బాండ్ల నోటిఫికేషన్‌ జారీ కాగానే మంత్రి లోకేష్‌ ఒక్కటిన్నర రెట్లు ఎక్కువగా అమ్ముడుబోయాయని గొప్పలు చెప్పుకున్నారని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అందరూ తక్కువ వడ్డీకి ఇస్తే..
10.75 శాతం వడ్డీని ప్రతి మూడు నెలలకు చెల్లించే విధంగా అమరావతి బాండ్లను జారీచేశారని, పూణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ రూ.200 కోట్లను కేవలం 7.5 శాతం వడ్డీతో జారీచేస్తే ఆరున్నర రెట్లు అమ్ముడుబోయాయని (సబ్‌స్క్రైబ్‌) బుగ్గన తెలిపారు. అలాగే, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 9.3 శాతం వడ్డీతో రూ.195 కోట్ల మేరకు బాండ్లను విడుదల చేసిందని గుర్తుచేశారు. ఇతర ప్రాంతాల్లో తక్కువ వడ్డీకే బాండ్లు విడుదలవుతూ ఉంటే.. అధిక వడ్డీలిస్తూ బాండ్లను సేకరించిన చంద్రబాబు మాత్రం ఇది తన ఘనత అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అమరావతి బాండ్లపై వడ్డీని ప్రతి 12 నెలలకు కాకుండా ప్రతి మూడు నెలలకొక మారుస్తామని ప్రకటించారని.. దీనివల్ల వీటిపై వడ్డీ శాతం 10.32 శాతం నుంచి 10.75 శాతానికి పెరిగిందని బుగ్గన వెల్లడించారు. చంద్రబాబు దిగజారుడుతనాన్ని తల్చుకుంటే బాధ కలుగుతోందన్నారు. 

కేంద్రాన్ని అడిగే సాహసం చంద్రబాబుకు లేదు
ఆర్థిక వనరులు కావాలంటే ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాబట్టుకోవాలని, అయితే అందుకు చంద్రబాబు సాహసించడంలేదన్నారు. కేంద్రం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సామర్థ్యం చంద్రబాబుకులేదని.. అందుకే చివరికి ఆయన బాండ్లకు వెళ్లారన్నారు. ఇలా బాండ్ల రూపంలో రుణాలను సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని.. అందుకు అనేక షరతులకు తలొగ్గుతోందన్నారు. ఐదేళ్ల తరువాత రుణ మొత్తంలో 20 శాతం తిరిగి ఇస్తామన్న షరతు కూడా అమలుచేస్తామంటోందన్నారు. తొలుత రూ. 2,000 కోట్లను బాండ్ల రూపంలో సేకరిస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి రూ.1300 కోట్ల మేర సేకరించి మిగిలిన రూ.700 కోట్లను గ్రీన్‌షో ఆప్షన్‌ను విధించిందన్నారు. అంటే రూ. 2,000 కోట్ల రుణం సేకరించలేమేమోనన్న అనుమానం ప్రభుత్వానికి ఉందన్నారు.

తక్కువ వడ్డీతో రూ.2,000 కోట్ల బాండ్లను సేకరించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి జీవో నెంబరు 65ను విడుదల చేసిందని, ఆ తరువాత జీవో నెంబరు 266 ద్వారా వడ్డీని 10.32 శాతంగా నిర్థారించిందని ఈ నిర్ణయం ఎందుకు మారిందో చెప్పాలని రాజేంద్ర డిమాండ్‌ చేశారు. రిజర్వు బ్యాంకు, స్టేట్‌ డెవెలప్‌మెంట్‌ ద్వారా వెళ్తే తక్కువ వడ్డీకే రుణ బాండ్లు లభిస్తాయని గతంలో 8.4శాతం వడ్డీతో ఏపీ రూ.1,000 కోట్లు, అసోం రూ.500 కోట్లు, మధ్యప్రదేశ్‌ రూ.1,000 కోట్లు, కేరళ రూ.2,500 కోట్లు, తమిళనాడు రూ.1,000 కోట్ల మేర బాండ్లను సేకరించాయని ఆయన వివరించారు. బాండ్ల వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించే బ్రిక్‌వర్క్స్‌ అనే ఏజెన్సీని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించిందని.. దసరా ఎకౌంట్‌లో ఎఫ్‌డీ రూపంలో పెట్టాలని వారు షరతు విధించారన్నారు. అంతేకాక, ఎస్క్రో ఎకౌంట్‌లో కట్టాల్సిన డబ్బు పెట్టాలని.. ఆరు నెలలు వడ్డీతో పాటు ఒకటిన్నర శాతం అదనంగా ఎస్క్రో ఎకౌంట్‌లో పెడతామన్న షరతుకూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. ఆ కంపెనీకి సుమారు రూ.20 కోట్లు చెల్లించేందుకు కూడా రంగం సిద్ధమైందన్నారు. రుణాలను ఇచ్చే సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు భరోసా కల్పించేందుకు ముందుగా ఎకౌంట్లలో నిధులను డిపాజిట్‌ చేసేందుకు కూడా అంగీకరించారని చెబుతున్నారన్నారు. వడ్డీ, రుణాలను చెల్లించేందుకు కూడా తగిన ఏర్పాట్లుచేశారని చెబుతున్నారని రాజేంద్ర విమర్శించారు. 

ఆ తొమ్మిది మంది పేర్లు వెల్లడించాలి
ఇదిలాఉంటే.. తొమ్మిది మంది పెట్టుబడిదారులు బాండ్ల రూపంలో రుణాలను ఇస్తున్నారని, వారి పేర్లను బహిరంగపర్చాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. బాండ్లకు సంబంధించిన నియమ నిబంధనలు, షరతులను కూడా బయటపెట్టాలన్నారు. జీఓ నెంబరు 65 ప్రకారం హడ్కో నుంచి తీసుకునే రుణం 8 శాతం దాటకూడదని, అలా దొరక్కపోతే బాండ్లలో 6 శాతం దాటకూడదని పేర్కొన్నారని.. ఇప్పుడు 10 శాతానికి మించిన వడ్డీతో బాండ్లు జారీచేయడం ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఏపీపై రూ.2.5లక్షల కోట్ల అప్పు
కాగా, ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఈ భారం అంతా ఏపీ ప్రజలపై పడుతోందని బుగ్గన అన్నారు. ఏపీ అప్పు ఇప్పటికే రూ.97 వేల కోట్ల నుంచి రూ.రెండున్నర లక్షల కోట్లకు చేరుకుందన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రూ.1.5 లక్షల కోట్లు అప్పు పెరిగందని ఆయన చెప్పారు. గతంలో ఆస్తి, అప్పుల నిష్పత్తి ప్రశంసనీయంగా ఉంటే చంద్రబాబు హయాంలో అప్పుల మోత మోగుతోందన్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్‌ అమెరికా విశ్వవిద్యాలయంలో చదివారంటారని, మరి ఆయనకు అప్పు–గ్రాంటుకు మధ్య ఉన్న తేడా తెలియకపోవడం శోచనీయమన్నారు. అప్పు చేసింది చాలక అదేదో ఘనమన్నట్లు ఆయన ట్వీట్‌ చేశారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు తిరిగి చెల్లించనక్కరలేదని అప్పు మాత్రం తిరిగి చెల్లించాలన్నారు.

అమరావతి బాండ్ల గురించి పచ్చ మీడియా అదేదో గొప్ప విజయమంటూ వార్తలు రాయడం దారుణమని బుగ్గన తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రపంచంలో తామే తొలుత బాండ్లను జారీచేసినట్లుగా.. అదేదో గొప్ప అన్నట్లుగా చంద్రబాబు చెప్పుకుంటూ ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నారని, అప్పులవల్ల ఇప్పుడు ఏపీలోని ప్రతి కుటుంబంపైన రూ 2.5 లక్షల భారం పడుతోందన్నారు. కాగా, సీఆర్డీయే పరిధిలో ఇప్పటివరకు రూ.829 కోట్ల విలువైన పనులే జరిగాయని.. వేల కోట్ల పనులు జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుగ్గన ఆరోపించారు.

మరిన్ని వార్తలు