‘చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిలా మారారు’

28 Mar, 2019 15:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అధికార పార్టీకి అండగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్‌ ఏడీజీ, ఐపీఎస్‌లపై ఈసీ వేటువేయడంపై చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తూ, రాజ్యాంగేతర శక్తిలా మారారని మండిపడ్డారు. గతంలో ఎస్పీ యాదవ్‌ బదిలీ విషయంలో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. కల్లు తాగిన కోతిలా ఎందుకు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఒక పోలీస్‌ అధికారిని బదిలీ చేస్తే సీఎంకు ఎందుకు ఇబ్బంది అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి మాత్రమేనని జ్యుడిషీయరి తన పరిధి కాదన్నారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీకి ప్రవేశం లేదని చెప్పడాన్ని తప్పుపట్టారు. 

చంద్రబాబు వల్లే ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని,  పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చేయాలని అంటారేమోనని విమర్శించారు. చంద్రబాబు మాటలను ప్రజలెవ్వరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి అప్పుడే ఎన్నికలు సజావుగా సాగుతాయని సూచించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే మతిభ్రమించిన వ్యక్తి మాటల్లా ఉన్నాయని, కేసీఆర్ పేరు ఇక్కడ ఎందుకు? ఆయనకు ఏపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హరికృష్ణ శవం పక్కన బెట్టుకుని టీఆరెస్తో పొత్తుకు ప్రయత్నించలేదా అంటూ దుయ్యబట్టారు.  చంద్రబాబు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారని తాను అనుకోలేదన్నారు.
 

మరిన్ని వార్తలు