ముగిసిన ఐదో దశ ప్రచారం

5 May, 2019 05:03 IST|Sakshi

7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాల్లో రేపు పోలింగ్‌

బరిలో మంత్రులు, ప్రముఖులు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఐదో దశ ఎన్నికలకు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, రాజస్తాన్‌లో 12, పశ్చిమబెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, కశ్మీర్‌లోని 2 స్థానాల్లో సోమవారం పోలింగ్‌ జరగనుంది. మొత్తం 51 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 6వ తేదీన జరగనున్న పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే వారిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్, స్మృతి ఇరానీ, జయంత్‌ సిన్హా, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్, కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ తదితరులున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారంపై ఫొని తుపాను ప్రభావం పడింది.

వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని పొరుగునే ఉన్న ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇలా ఉండగా, బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా భూమిపై హక్కు కోసం వీరోచితంగా పోరాడిన, గిరిజనులు దైవంగా భావించే బిర్సా ముండా జన్మించిన జార్ఖండ్‌లో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర రాజధాని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలోని మావోయిస్టుల ప్రభావిత ఖుంతి జిల్లాలో 100కు పైగా గిరిజన గ్రామ పంచాయతీల ప్రజలు ఈ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తామే పాలకులమనీ, తమ గ్రామాల్లోకి ఎవరినీ అనుమతించబోమంటూ తీర్మానించారు. తమను గురించి కనీసం పట్టించుకోని నేతలతో పని లేదని వీరు వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు