తీర్పులో సమీక్షించేంత తప్పేం లేదు

5 May, 2019 04:56 IST|Sakshi

రఫేల్‌ కేసుపై సుప్రీంకు కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: రఫేల్‌ కేసుకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన విస్పష్టమైన తీర్పులో సమీక్షించాల్సినంత తప్పేమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం శనివారం తెలిపింది. తీర్పు సమీక్ష పేరిట పిటిషనర్లు.. కొన్ని పత్రికా కథనాలు, చట్టవ్యతిరేకంగా, అనధికారికంగా సేకరించిన కొన్ని అసంపూర్తి అంతర్గత ప్రభుత్వ పత్రాలను ఆధారంగా చేసుకుని మొత్తం వ్యవహారాన్ని తిరగదోడాల్సిందిగా కోరలేరని చెప్పింది. ప్రభుత్వ రహస్య సమాచారాన్ని ఈ విధంగా వెల్లడించడం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుందని తెలిపింది. రఫేల్‌ కేసులో గత ఏడాది డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం శనివారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

రివ్యూ పిటిషన్‌ ద్వారా కోర్టు నుంచి మరొక విచారణ ఉత్తర్వు తెచ్చుకునేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారంది. కొందరు వ్యక్తుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని విచారణ జరిపేందుకు కోర్టు ఇంతకుముందే నిరాకరించిందని తెలిపింది. 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఇందులో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని కోర్టు భావించిందని వివరించింది. మీడియా కథనాల ఆధారంగా కోర్టులు నిర్ణయం తీసుకోలేవని చట్టంలోనే ఉందని తెలిపింది. కేసులో యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరితో పాటు మరో ఇద్దరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారం విచారణ జరపనుంది. 

మరిన్ని వార్తలు