నరసరావుపేట టీడీపీ అభ్యర్థిపై కేసు

29 Mar, 2019 12:20 IST|Sakshi

నిర్లక్ష్యంగా శస్త్రచికిత్స చేసినందుకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుడాక్టర్‌ అరవిందబాబే మా అమ్మ ప్రాణం తీశాడు  ప్రశ్నించిన బాధిత కుటుంబీలకు బెదిరింపులు 

నరసరావుపేట టౌన్‌ : నిర్లక్ష్యంగా వైద్యంచేసి వృద్ధురాలి మృతికి కారణమైన నరసరావుపేట అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుపై కేసు నమోదైంది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం టూటౌన్‌ పోలీసులను బాధిత కుటుంబ సభ్యులు కోరారు. వివరాల్లోకి వెళ్తే.. 

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన పంపనాతి చిన్నయోగమ్మ (77) గతేడాది నవంబరు 6న ఇంట్లో జారిపడటంతో ఆమె ఎడమకాలు విరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను నరసరావుపేటలో డాక్టర్‌ అరవిందబాబు నిర్వహిస్తున్న అమూల్య నర్సింగ్‌ హోమ్‌లో చేర్పించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ అరవిందబాబు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, ఇంటికి వెళ్లిన రెండోరోజే కాలు నలుపుగా మారటంతో తిరిగి ఆస్పత్రికి వచ్చి చూపించారు. అయితే, భయపడాల్సిందేమీలేదని, క్రమంగా తగ్గుతుందని చెప్పి ఇంటికి పంపారు. కాలుకు స్పర్శ లేకపోవటంతో డాక్టర్‌ కోర్సు చదువుతున్న చిన్నయోగమ్మ మనవడు ఇది గమనించి వైద్యుడిని కలిసి నిర్లక్ష్యంపై ప్రశ్నించగా డాక్టర్‌ అరవిందబాబు దురుసుగా ప్రవర్తించారు. దీంతో అతడిపై రెండు నెలల క్రితమే టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే, అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అనంతరం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కాలు తొలగిస్తేనే యోగమ్మ బతుకుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందింది. 

డాక్టర్‌ నిర్లక్ష్యమే మృతికి కారణం
డాక్టర్‌ అరవిందబాబు నిర్లక్ష్యంవల్లే తన తల్లి మృతిచెందిందని ఆమె తనయుడు పంపనాతి వెంకటేశ్వర్లు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బి.ఆదినారాయణ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. గుంటూరు వైద్యశాలలోని ఎముకల విభాగ వైద్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ అరవిందబాబుకు ఉన్న రాజకీయ పలుకుబడితో చర్యలకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని బాధితులు వాపోయారు. కాగా, దీనిపై సీఐ ఆదినారాయణ మాట్లాడుతూ.. మృతురాలి కుమారుడు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు