జయ మృతి: వెలుగులోకి మరో సంచలన అంశం!

22 Mar, 2018 16:59 IST|Sakshi
ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న ఫొటో

జయలలిత ఆస్పత్రిలో ఉన్నంతకాలం సీసీటీవీ కెమెరాలు బంద్‌

సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి అనేక అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలితత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యం, చికిత్స తదితర విషయాలను గోప్యంగా ఉంచడం.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తమను సైతం లోపలికి వెళ్లి జయను చూడనివ్వలేదని అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు ఆరోపించడంతో ఆమె మృతి ఒక మిస్టరీగా మారింది. ఆమె మృతి వెనుక కారణాలపై రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్‌ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జయలలిత మృతికి సంబంధించి మరో సంచలన అంశం వెలుగుచూసింది. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీసీటీవీ కెమెరాలు బంద్‌ (స్విచ్చాప్‌) చేశారని, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నంతకాలం అవి పనిచేయలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందినతీరు వీడియో రికార్డు కాలేదని తేలిపోయింది. దీంతో ఆస్పత్రిలో నిజానికి ఏం జరిగిందనే దానిపై మరిన్ని అనుమానాలు వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

‘దురదృష్టవశాత్తు సీసీటీవీ కెమెరాలను స్విచ్‌ ఆఫ్‌ చేశారు. జయలలిత ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాక.. ఐసీయూను పూర్తిగా ఆమె కోసమే కేటాయించాం. అందువల్ల ప్రతి ఒక్కరూ సీసీటీవీ దృశ్యాలు కూడా చూడకూడదని, వాటిని తొలగించాం’  అని అపోలో చైర్మన్‌ సీ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు