జాతీయ విద్యాసంస్థలకు రూ. 6143 కోట్లు కేటాయించాం

3 Jan, 2019 17:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా సంస్థలకు 6,143 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం కోసం జరిపిన నిధుల కేటాయింపు గురించి వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ స్థాయి ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి ఈ మొత్తం కేటాయించినట్టు గురువారం రాజ్యసభలో వెల్లడించారు. అంతేకాకుండా రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు.

విద్యాసంస్థలకు కేటాయించిన మొత్తంలో 2018 డిసెంబర్‌ నాటికి 195.14 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2017-18 బడ్జెట్‌లో విద్యా సంస్థలకు 250 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందని చెప్పిన సత్యపాల్‌ సింగ్‌.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఏపీలో సెంట్రల్‌ యూనివర్సిటీ, ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్‌ యూనివర్సిటీ సవరణ బిల్లు 2018 డిసెంబర్‌ 14వ తేదీన లోక్‌సభ ఆమోదం పొందినట్టు తెలిపారు.

కేటాయింపుల్లో.. సెంట్రల్‌ యూనివర్సిటీకి 902 కోట్లు, ట్రైబల్‌ యూనివర్సిటీకి(తెలంగాణతో కలిపి) 834 కోట్లు, ఐఐటీ తొలి దశకు 1074 కోట్లు, ఎన్‌ఐటీకి 460 కోట్లు, ఐఐఎంకు 594 కోట్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌కి 1979 కోట్లు, ట్రిపుల్‌ ఐఐటీకి 297 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయా విద్యా సంస్థలను శాశ‍్వత క్యాంపస్‌లకు తరలించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి ఐఐటీ భవనాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనట్టు మంత్రి గుర్తుచేశారు.  
 

మరిన్ని వార్తలు