వెంటాడుతున్న ఓటమి భయం

19 Mar, 2019 05:29 IST|Sakshi

ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండానే అసెంబ్లీ బరిలో నారా లోకేష్‌

సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డిలకు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశాకే అసెంబ్లీ టికెట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు

కుమారుడు లోకేష్‌ విషయానికి వచ్చేసరికి మరో న్యాయం..

పుత్రరత్నం కోసం ఎన్నో పాట్లు.. మంగళగిరి బరిలో దిగకుండా జనసేనతో రహస్య ఒప్పందం

సాక్షి, గుంటూరు: పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రామసుబ్బారెడ్డిలను తమ శాసన మండలి పదవులకు రాజీనామాలు చేయించిన తరువాతే టీడీపీ అధినేత చంద్రబాబు వారికి అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించారు. అయితే చినబాబు విషయంలో మాత్రం ఈ సూత్రాన్ని సీఎం చంద్రబాబు పాటించడం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో నారా లోకేష్‌ రాణించలేరన్న భయం చంద్రబాబును వెంటాడుతున్నట్టుంది. అందుకే పార్టీలోని ఇతర నాయకులకు ఒక న్యాయం అమలు చేస్తే.. చినబాబుకు మాత్రం మరో న్యాయం పాటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది నియోజక వర్గాల్లో సర్వేలు నిర్వహించి సురక్షిత స్థానమని భావించిన తరువాత లోకేష్‌ను మంగళగిరి బరిలో చంద్రబాబు నిలిపారు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా లోకేష్‌ విజయం సాధించడం అనుమానమేనని చంద్రబాబు భావిస్తున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. అందువల్లే నారా లోకేష్‌తో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించడం లేదని వారు చర్చించుకుంటున్నారు.

కొడుకు గెలుపుపై నమ్మకం లేకే..
2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన పుత్రరత్నం నారా లోకేష్‌ను పోటీ చేయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గు చూపలేదు. తీరా పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఎమ్మెల్సీగా దొడ్డిదారిన చట్టసభల్లో తీసుకుని మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో లోకేష్‌ పోటీ చేస్తారని ఆది నుంచి లీకులిస్తూ వచ్చారు. కానీ ఐటీ శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్‌ పేలవ ప్రదర్శన కనబర్చడంతో ప్రజల్లో అతనికి పెద్దగా ఆదరణ లభించలేదు. పైగా ఏ రాజకీయ సభలో పాల్గొన్నా, చివరకు అధికారిక సభలు నిర్వహించిన సందర్భాల్లోనూ నోరు జారుతుండటం పరిపాటిగా మారింది. దీంతో ఆయన మాటల్ని సోషల్‌ మీడియాలో పెట్టి ‘పప్పు’ అంటూ నెటిజన్లు ప్రచారం చేపట్టారు. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్‌ను పోటీ చేయించడంపై మల్లగుల్లాలు పడ్డారు.

చివరకు మంగళగిరి స్థానం నుంచి ఆయన్ను పోటీకి దించాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇక్కడా లోకేష్‌ గెలుస్తారనే నమ్మకం లేక చంద్రబాబు.. మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలపకుండా పవన్‌కల్యాణ్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఆ స్థానాన్ని సీపీఐకి జనసేన ఇచ్చేలా పావులు కదిపారు. అయితే ఓటమి భయంతో లోకేష్‌తో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించే సాహసానికి దిగలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం తారుమారైతే లోకేష్‌ ఎమ్మెల్సీగా కొనసాగవచ్చుననే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదంటూ సొంత పార్టీ నేతలే అంటుండడం గమనార్హం. లోకేష్‌ విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలన్నీ కొడుకుపై నమ్మకం లేకో, ఓటమి భయంతోనో చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నదని వారు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు