సభలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు

13 Jun, 2019 12:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన సభలో ప్రతిపక్ష నేతగా హుందాతనాన్ని విస్మరించారు. ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.  తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ చిన అప్పలనాయుడు.. సభా నాయకుడు, ఇతర పార్టీల నాయకులు నూతన సభాపతిని కుర్చీ వద్దకు తీసుకురావాల్సిందిగా ప్రకటించారు. ఈ సందర్భంగా సభలోనే ఉన్న చంద్రబాబు వింతగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మంత్రులు స్వయంగా వెళ్లి స్పీకర్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చొబెట్టగా.. చంద్రబాబు మాత్రం తన సీటు నుంచి కదలకుండా.. టీడీపీ నేతలను పంపించారు. ప్రతిపక్ష నాయకుడు కూడా వెళ్లి సభాపతిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. 

గత స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నిక సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ ఆనవాయితీని పాటించాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కోడెలను స్పీకర్ స్థానంలో వైఎస్‌ జగన్‌ కూర్చోబెట్టారు. తాజాగా చంద్రబాబు మాత్రం తాను వెళ్లకుండా.. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుని పంపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవముందని, రాజకీయాల్లో తానే సీనియర్‌ని అని చెప్పుకొనే చంద్రబాబు సభలో కనీస సంప్రదాయాలను, విలువలను పాటించకపోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ విషయంలో టీడీపీ నేతలు వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు. స్పీకర్‌ను ఎంపికపై ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వడం సంప్రదాయమని, అలాగే సభాపతిని కూర్చోబెట్టే సమయంలోనూ ప్రతిపక్ష నేతను పిలవలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఆరోపణలకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. టీడీపీ నేతలకు అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయిందని, మీరు పాటించని సంప్రదాయాల గురించి మాకు చెప్పకండంటూ హితవు పలికారు. బలహీన వర్గాల నేత స్పీకర్‌గా ఎన్నికైతే కుర్చీ దాకా తీసుకువెళ్లాలన్న కనీస మర్యాదను కూడా చంద్రబాబు పాటించలేదని శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు.

చదవండి:
స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని 
విలువల్లేని రాజకీయాన్ని ఇదే సభలో చూశాం: వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు