జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

13 Jun, 2019 12:10 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా కార్యకలాపాలు నిలిపివేసిన ప్రయివేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లావాదేవీల నిర్వహణ (ట్రేడింగ్‌ యాక్టివిటీ)లో ఆంక్షలు విధించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించినట్లు వెలువడిన వార్తలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జెట్‌ ఎయిర్‌ వేస్‌ షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో గురువారం నాటి మార్కెట్‌లో జెట్‌ షేరు ఏకంగా 23శాతం పతనమైంది. తద్వారా సరికొత్త కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 986.03 కోట్లకు పడిపోయింది. బిఎస్ఇలో 15.61 లక్షల షేర్లు చేతులుమారాయి. స్టాక్ గత తొమ్మిది రోజుల్లో 40శాతానికి  పైగా పతనమైంది. 

జెట్ షేర్లను రోజువారీ ట్రేడింగ్నుంచి తీసివేయనున్నామని నేషనల్ స్టాక్ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తెలిపింది. గరిష్టస్థాయిలో ఆటుపోట్లను చవిచూడకుండా నివారించే బాటలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.  జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ యాక్టివిటీపై నియంత్రణలు విధించనున్నట్లు  ఎన్‌ఎస్‌ఈ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.  ఈ ఆంక్షలు ఈ నెల 28 నుంచీ అమల్లోకిరానున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ఈ షేరును ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచి తొలగించనున్నారు. ఫలితంగా 100 శాతం మార్జిన్ల చెల్లింపుతోపాటు 5 శాతం ప్రైస్‌బ్యాండ్‌ అమలు కానుంది. 

మరిన్ని వార్తలు