బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు

22 Feb, 2019 09:16 IST|Sakshi

ఏపీ ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే మద్దతు

రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు

అమిత్‌ షా కాదు అతనో అబద్ధాల షా

2014కంటే ముందు అమిత్ షా ఎక్కడున్నారు?

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదంటూ ఈ సందర్భంగా చంద్రబాబు భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. ‘బీజేపీ చీఫ్‌ అమిత్‌ సా నిన్న రాష్ట్రానికి వచ్చి అవాకులు చవాకులు పేలారు. గత అయిదేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదు. 90 శాతం చేసేసినట్లు అమిత్‌ షా పచ్చి అబద్ధాలు చెప్పారు. అమిత్‌ షా కాదు అతనో అబద్ధాల షా. 2014కంటే ముందు అమిత్ షా ఎక్కడ ఉన్నారు..?

ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం బీజేపీ నేతల్లో ఏమాత్రం లేదు. ఇంకా రెచ్చగొడుతున్నారు, బాధపెడుతున్నారు. రెచ‍్చగొట్టి, బాధపెట్టి బీజేపీ నేతలు ఆనందం పొందుతున్నారు. గతంలో పనులు చేసి, ప్రజలను మెప్పించే రాజకీయాలు ఉంటే... ఇప్పుడు బీజేపీ రెచ్చగొట్టి ...బాధపెట్టే రాజకీయాలు తెచ్చింది. అమిత్‌ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరగాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా?. విశాఖపట్నానికి రైల్వేజోన్‌ ఇచ్చారా?. కడపలో స్టీల్‌ ఫ్లాంట్‌కు నిధులు ఇచ్చారా?. కాకినాడలో పెట్రో కాంప్లెక్స్‌ పెట్టారా?. ఏం చేశారని 90శాతం లెక్క చెబుతున్నారు. ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారు. రాష్ట్రంపై నరేంద్ర మోదీ, అమిత్‌ షా కక్ష కట్టారు. పగ, ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కూడా ఆంధ్రప్రదేశ్‌పై అసూయ, ద్వేషం ప్రదర్శిస్తున్నారు. ప్రధాని, కేసీఆర్‌ ప్రతిపక్ష నేతకు సహకరిస్తున్నారు. 

ఉగ్రదాడులపై గతంలో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ వ్యాఖ్యలనే ప్రస్తావించాం. మోదీ అప్పట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ఏం మాట్లాడారు?. మోదీ అప్పటి మాటలనే నేను మళ్లీ గుర్తు చేశా. దానిపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం అనవసరం. టీడీపీ చేసింది మోసం కాదు, బీజేపీ చేసింది నమ్మకద్రోహం. మోసాలు, కుట్రలు చేస్తోంది బీజేపీనే. దేశానికి ఎవరు ద్రోహులో, ఎవరు రాజకీయాలకు వాడుకుంటున్నారో ప్రజలే తేలుస్తారు.’ అని అన్నారు. ఇక కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల సమీక్ష పూర్తయిందని, నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష పూర్తికాగా, మరో రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.


 

మరిన్ని వార్తలు