టీడీపీ ‘భ’జనసేనే

21 Mar, 2019 08:06 IST|Sakshi

అధికార పార్టీ అభ్యర్థులకు లాభించేలా జనసేన టికెట్లు

మాడుగులలో టీడీపీ అభ్యర్థి తమ్ముడికే సీటు

మంత్రి గంటాపై నామమాత్రపు పోటీ

మరో మంత్రి అయ్యన్నపై ఇప్పటి వరకు అభ్యర్ధే లేడు...

చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

స్పష్టమవుతున్న  సైకిల్‌–గ్లాస్‌ తెరువెనుక బంధం

2014 ఎన్నికల ముందునాటి మాట.. హైదరాబాద్‌ స్టార్‌ హోటల్‌లో జనసేన ఆవిర్భావ ముచ్చట..అది జరిగిన ఉత్తర క్షణమే.. చంద్రబాబు స్వయంగా పవన్‌కల్యాణ్‌ ఇంటికి వెళ్లడం.. ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలని కోరడం.. దానికి  సై అనడం చకచకా జరిగిపోయాయి.ఎన్నికల అనంతరం పవన్‌ రాజకీయాలను పక్కనపెట్టి.. మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోయారు. అడపా దడపా టూర్లు చేయడం.. కష్టాల్లో పడినప్పుడల్లా చంద్రబాబు సర్కారును ఆదుకునేలా ప్రసంగాలు చేయడం.. ఇదీ ఆయన శైలి.. ఏడెనిమిది నెలల క్రితం అజ్ఞాతవాసి సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ తర్వాత మళ్లీ జనసేన జెండా పట్టుకుని నేరుగా పోటీ అంటూ హల్‌చల్‌ చేయడం.. అభ్యర్థులను ప్రకటించడం ప్రస్తుతం నడుస్తున్న సినిమా..తెరపై ఈ సినిమా చూపిస్తున్నా తెర వెనుక సినిమా వేరే ఉంది. ఈసారి ఎన్నికల్లో  టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నా.. తెరవెనుక ఆ పార్టీలు కలిసే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇందులో ఏదైనా అనుమానముందా?.. అయితే మచ్చుకు మన విశాఖ జిల్లాలోనే ఆ రెండు పార్టీలు ఖరారు చేసిన అభ్యర్థులను ఒక్కసారి తరచి చూడండి. మొత్తంగా చూసే ఓపిక లేదనుకుంటే.. కనీసం మాడుగుల నియోజకవర్గ టీడీపీ, జనసేన అభ్యర్థులెవరో చూడండి.. ‘సైకిల్‌–గ్లాస్‌’ ఉమ్మడి సినిమా  కనిపిస్తుంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘మాటలు పవన్‌వి.. చేతలు టీడీపీవి..  జనసేన టికెట్లను టీడీపీ నిర్ణయించింది!’.. ఈ వ్యాఖ్యలు ఎవరివో కాదు స్వయంగా జనసేన పార్టీలో కీలకంగా తిరిగిన మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతివి. ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన భానుమతిని పవన్‌ స్వయంగా ఆహ్వానించడంతో ఆమె జనసేనలో చేరారు. ఆమె మనుమడు, విదేశాల్లో చదువుకున్న రఘురాజుకు మాడుగుల టికెట్‌ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ మేరకు డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. మీలాంటి యువకులే కావాలని సందేశాలు కూడా ఇచ్చిన పవన్‌.. టికెట్ల ఖరారుకు వచ్చేసరికి మాడుగుల టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు సోదరుడైన సన్యాసినాయుడికి కట్టబెట్టేశారు. ఇదేం అన్యాయం.. మేం ఏమైనా టికెట్‌ అడిగామా.. వాళ్ళే పిలిచి.. టికెట్‌ ఇస్తామని చెప్పి ఇంత అవమానం చేశారని భానుమతి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ కనీసం ఎందుకిలా చేశారో తెలుసుకుందామన్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందని ఆమె వాపోతున్నారు. కేవలం టీడీపీని గెలిపించడమే ధ్యేయంగా జనసేన టికెట్లు ఇస్తున్నారని, ఇందుకు తమ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ భానుమతి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలా చోట్ల ఇదే కుమ్మక్కు
ఒక్క మాడుగుల టికెట్‌ విషయంలోనే కాదు జిల్లాలో చాలా టికెట్ల కేటాయింపుపై లోతుగా పరిశీలిస్తే టీడీపీ, జçనసేన కుమ్మక్కు రాజకీయం కళ్ళకు కట్టినట్టు అర్ధమవుతుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధిగా పసుపులేటి ఉషాకిరణ్‌ను పోటీకి దించారు. ఆర్ధికంగా, రాజకీయంగా బలపడిన గంటాపై పోటీకి ఆర్ధికంగా ఏమాత్రం దన్నులేని ఉషాకిరణ్‌ను నిలబెట్టడంలోనే అక్కడ పోటీ నామమాత్రమేనని స్పష్టమవుతోంది. పైగా ఉషాకిరణ్‌ భర్త మంత్రి గంటాకు అత్యంత సన్నిహితుడనేది అందరికీ తెలిసిన విషయమే.  గంటాతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఆమెను అక్కడ పోటీకి దించారనేది టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్న వాస్తవం. ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చిన  భీమిలి నియోజకవర్గంలో కూడా జనసేన ఎవరికీ తెలియని పంచకర్ల సందీప్‌ను నిలబెట్టింది. సదరు సందీప్‌.. టీడీపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు, యలమంచిలి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు వరుసకు సోదరుడు. పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎక్కువగా ఉన్నారని భావిస్తున్న పాయకరావుపేటలో కూడా నియోజకవర్గంతో సంబంధం లేని తూర్పుదోదావరి జిల్లాకు చెందిన నక్కా రాజబాబును దిగుమతి చేయడం కూడా టీడీపీ అభ్యర్ధిని ఆదుకోవడానికేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఇప్పటివరకు సరైన ’బలహీన’ అభ్యర్థి దొరక్క ఖాళీగానే ఉంచేశారు.

అరకు ఎంపీ అభ్యర్థి విషయంలోనూ..
మన్యంపై చాలా ప్రభావం చూపిస్తామని చెబుతూ వచ్చిన పవన్‌కల్యాణ్‌ అరకు లోక్‌సభ సీటును పొత్తుల పేరుతో సీపీఐకి వదిలేశారు. ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన పాంగి రాజారావు తాను పోటీ చేయలేనని, నామినేషన్‌ కూడా దాఖలు చేయనని స్పష్టం చేసేశారు. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే విధంగా అభ్యర్ధుల ఎంపిక జరిగిందనేది స్పష్టమవుతోంది. పవన్‌పై సినీమోజుతో ఆర్ధికంగా బలంగా ఉన్న వారు జనసేన తరఫున పోటీకి సిద్ధంగానే ఉన్నా... ఏరికోరి డమ్మీలను, ఆర్థిక బలం లేనివారిని.. మొత్తంగా నామమాత్రపు అభ్యర్థులను బరిలోకి దించడం చూస్తేనే టీడీపీ అభ్యర్ధులకు లాభించేలానే జనసేన టికెట్ల ఎంపిక జరిగిందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాదు కాదు,. స్వయంగా ఇది జనసేన టికెట్‌ బాధితుల వాదన.

మరిన్ని వార్తలు