ఆ ఇద్దరిపై గుబులు

5 Jul, 2018 10:24 IST|Sakshi

పెద్దిరెడ్డి, మిథున్‌లను ఎదుర్కోవడమెలా?

కట్టడి చేయకుంటే టీడీపీకి తీరని కష్టం

సమన్వయం లేకుంటే ఇప్పుడున్నవి గల్లంతే

రాజంపేట పార్లమెంటరీ పరిధిలో తమ్ముళ్లకు చంద్రబాబు మార్గదర్శకత్వం

కొందరు నేతలకు హెచ్చరికలు

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి భయం పట్టుకుంది. జిల్లా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోవడమే ధ్యేయంగా నాయకులందరూ పనిచేయాలని సీఎం స్వపక్షీయులకు మార్గదర్శకం చేశారు. రాజంపేట పార్లమెంటరీ పరిధిలో మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ముఖ్యనాయకులతో సోమ, మంగళవారం అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆద్యంతం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌ను  ఎదుర్కొనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈతండ్రీతనయులను కట్టడి చేయకుంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

జిల్లానుంచి 2014 ఎన్నికల్లో  వైఎస్సార్‌ సీపీ రెండు ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే స్థానా లు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ఇద్దరితోపాటు జిల్లాలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను నిలువరించకుంటే ఉన్న ఆరు నియోజకవర్గాలలోనూ భంగపాటు తప్పదని హెచ్చరించారు. తండ్రీ కొడుకుల లక్ష్యంగా అమరనాథరెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి కట్టబెట్టిన విషయం, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి కి ఏపీ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ పదవి, సుభాష్‌చంద్రబోస్‌కు ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ చైర్మన్‌గా, చల్లాబాబుకు టీటీడీ బోర్డు మెంబర్, పర్వీన్‌తాజ్‌కి మహిళా కమిషన్‌ సభ్యురాలి పదవువులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు భోగట్టా.

ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కనుమరుగవ్వడం ఖాయం..
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్‌ అందుబాటులో ఉండటం లేదని, ఇలాగైతే ఎన్నికల్లో కనుమరుగవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి కోసం వెళ్లిన నాయకులకు చుక్కెదురైంది. నాయకత్వానికి సంబం ధించి ఎలాంటి ప్రకటనా చేయకున్నా నాయకులను మాత్రం గట్టిగానే మందలించినట్లు సమాచారం. సీఎం సహాయనిధి చెక్కులతో లక్షలాది రూపాయలు పంపిణీ చేసి ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయామని చెప్పుకున్న బొమ్మనచెరువు శ్రీరాముల్ని ‘నీ జాతకం మొత్తం నా వద్ద ఉంది. ఆ చెక్కులు దుర్విని యోగం జరిగిందన్న సమాచారం తనవద్ద ఉంది’ అని చెప్పడంతో శ్రీరాములు షాక్‌కు గురైనట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త బాబురెడ్డి తీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశా రు.  అధికారులు మాట వినడం లేదనే సాకుతో ఇంట్లో కూర్చుంటే సరిపోదని హెచ్చరించినట్లు టీడీపీ శ్రేణులు వెల్లడిం చాయి. పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టానికి కృషి చేయాలని, సమన్వయంతో పనిచేస్తే తప్ప గెలుపు  అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో  కమిటీ వేసుకోవాలని సూచించారు.

కార్పొరేషన్లు సాధ్యం కావు..
కురబ, చేనేత కార్పొరేషన్ల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. చేనేత కార్పొరేషన్‌కు సంబం ధించి ఆప్కో ఉన్నందున మళ్లీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని సీఎం తిరస్కరించినట్లు తెలిసింది. కురబ కార్పొరేషన్‌ ఏర్పాటు పరిశీలనలో ఉందని చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు