బీసీలంటే బాబుకు పడదంతే..!

26 Mar, 2019 10:49 IST|Sakshi

వీఆర్‌ఎస్‌కు ఆమోదం తెలుపకుండా గోరంట్ల మాధవ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు

ఇప్పుడే కాదు..ఆవేళ ఇద్దరు బీసీ న్యాయవాదులు జడ్జీలు కాకుండా అడ్డుపుల్ల

నాయీ బ్రాహ్మణుల తాట తీస్తానన్నదీ ఈయన గారే..

సాక్షి, అమరావతి:  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు బద్ధ వ్యతిరేకని మరోసారి రుజువైంది. అంతేకాదు బీసీలను ప్రతిపక్ష పార్టీ ప్రోత్సహించినా సహించరని స్పష్టమయ్యింది. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌ ఉదంతం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్‌ పెట్టుకున్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) దరఖాస్తును, ఆ దరఖాస్తును ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా మొండికేయడం, చంద్రబాబుకు బీసీలంటే ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. మాధవ్‌ వారం పది రోజులుగా ఎక్కిన గడప ఎక్కకుండా తిరుగుతున్నా చంద్రబాబు మనసు కరగలేదు. పైగా ట్రిబ్యునల్‌ తీర్పుతో విభేదిస్తూ హైకోర్టుకు వెళ్లారు.

అయితే అక్కడ బాబుకు చుక్కెదురయ్యింది. ట్రిబ్యునల్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనకు అనుంగు శిష్యుని మాదిరి వ్యవహరించిన ఏపీ ఎన్జీవోల సంఘం నేత అశోక్‌ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఆఘమేఘాల మీద కేసులన్నింటినీ పరిష్కరించిన చంద్రబాబు.. గోరంట్ల మాధవ్‌ను ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి మాధవ్‌ చాలా కాలం కిందటే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఆయన వీఆర్‌ఎస్‌ను ఆమోదించకుండా కర్నూలు డీఐజీ నాగేంద్ర కుమార్‌ తొక్కిపట్టి తప్పించుకుతిరగడం అంతా సీఎం ఆదేశాల మేరకే జరుగుతోందనే విమర్శలు వచ్చాయి. వీఆర్‌ఎస్‌ను ఆమోదింపజేసుకోవడానికి ఓ బీసీ అభ్యర్థి పడిన కష్టం చూస్తుంటే ఆ వర్గాల పట్ల చంద్రబాబు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తారో మరోసారి రుజువైందని బీసీ సంఘాలు పేర్కొన్నాయి.

ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అంతే
చంద్రబాబు ఎప్పుడూ బీసీ వర్గాల వ్యతిరేకేనని పలువురు బీసీ సంక్షేమ సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. గతంలో బాబు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. హైకోర్టు జడ్జీలుగా ఇద్దరు బీసీ న్యాయవాదులను కొలీజియం సిఫారసు చేస్తే వారు ఆ పదవికి అర్హులు కాదంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బడుగు, బలహీనవర్గాల కోసమే తమ పార్టీ పుట్టిందని, తమకు ఆ వర్గాలే వెన్నెముక అంటూ చంద్రబాబు ఉత్తుత్తి కబుర్లు చెబుతారని, కానీ ఆయన మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుందని బీసీ నేతలు చెబుతున్నారు. తమకు న్యాయం చేయమని అడగడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులను ’ఏయ్, నోర్మూయ్, తాట తీస్తా’ అంటూ అహంకార పూరితంగా బెదిరించారని గుర్తుచేశారు. కాపుల్ని బీసీలలో, బోయల్ని ఎస్టీలలో, రజకుల్ని ఎస్సీలలో చేరుస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శిస్తున్నారు. 

మరిన్ని వార్తలు