భూమా వర్గానికి బాబు షాక్‌!

3 Mar, 2019 07:54 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నంద్యాల మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి చిచ్చురేపింది. టీడీపీ నాయకుడు, భూమా వర్గానికి చెందిన లక్ష్మీకాంతరెడ్డికి మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఇస్తారని అందరూ అనుకున్నా.. మాజీ కౌన్సిలర్, మంత్రి ఫరూక్‌ అనుచరుడు చింతల సుబ్బరాయుడుకు చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో టీడీపీలో వివాదం రాజుకుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, చైర్మన్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని లక్ష్మీకాంతరెడ్డి టీడీపీ అధిష్టానంపై భగ్గుమంటున్నారు. పార్టీలో ఉండాలో లేదో తేల్చుకుంటానని, తన సహచరులతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడంతో టీడీపీలో కాక రేపుతోంది.  

నంద్యాల : టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉన్న నంద్యాల మార్కెట్‌యార్డు కమిటీని ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. చైర్మన్‌ గా చింతల సుబ్బరాయుడు, వైస్‌ చైర్మన్‌గా రంగ సుబ్బయ్యలతో పాటు డైరెక్టర్ల పదవులకు పేర్లను సూచిస్తూ మార్కెట్‌యార్డు అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఈ పేర్లను పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాలని యార్డు కార్యదర్శికి ఆదేశాలు వచ్చాయి. చైర్మన్‌ పదవికి సుబ్బరాయుడు పేరును సూచించడంతో భూమా వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎంఎల్‌ లక్ష్మీకాంతరెడ్డికి ఈ పదవిపై హామీ ఇవ్వడంతో పాటు ఆయనకు పదవి ఇవ్వాలని అధిష్టానానికి సిఫార్సు కూడా చేశారు. అనంతరం భూమా నాగిరెడ్డి మరణించడం, ఉప ఎన్నికలు రావడంతో చైర్మన్‌ పదవి భర్తీ ఆలస్యమైంది.

ఉప ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఈ పదవిపై పలువురికి హామీ ఇచ్చినట్లు టీడీపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పదవిపై స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిలప్రియ సిఫార్సు మేరకు లక్ష్మీకాంతారెడ్డికి పదవి కూడా ఖరారైంది. జీఓ వస్తుందనుకున్న సమయంలో స్థానిక మంత్రి ఫరూక్‌ అడ్డుపడినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ పదవిని ఎవరికీ ఇవ్వకుండా చంద్రబాబు నాన్చుతూ వస్తున్నారు. కాగా సీఎం ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఇటీవల బలిజ సంఘం ప్రకటించింది.  ఈ క్రమంలో చింతల సుబ్బరాయుడు పేరు చైర్మన్‌ పదవికి ఖరారు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం నంద్యాల నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో నిన్నగాక మొన్న వచ్చిన సుబ్బరాయుడికి పదవి ఎలా ఇస్తారని భూమా వర్గం భగ్గుమంటోంది.

సీఎం హామీ ఇచ్చి మోసం చేశారు 
గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ మార్కెట్‌యార్డు చైర్మన్‌ నువ్వేనంటూ మంత్రుల సమక్షంలోనే హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలు అయిన వెంటనే నాపేరు ఖరారు చేస్తూ జీఓ జారీ చేసే క్రమంలో కొందరు అడ్డుకున్నారు. అయినప్పటికీ మొదటి నుంచి నాకే ఇస్తామని చెబుతుండటంతో ఆశ పెట్టుకున్నాను. ఇప్పుడు పార్టీ మా రి వచ్చిన చింతల సుబ్బరాయుడుకు చైర్మన్‌ పదవి ఇవ్వడం తగదు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను.   – లక్ష్మికాంతరెడ్డి   

>
మరిన్ని వార్తలు