టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు 

30 May, 2019 03:43 IST|Sakshi

ఎన్నుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు  

23 మందిలో ఒకరు సమావేశానికి గైర్హాజరు 

జగన్‌ ప్రమాణస్వీకారానికి బాబు దూరం 

ఆయన తరఫున హాజరుకానున్న ప్రతినిధి బృందం  

ఎన్నో చేసినా ప్రజలు భిన్నంగా తీర్పు ఇచ్చారు 

ఓటమిపై త్వరలో పూర్తి స్థాయి విశ్లేషణ 

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు  ఎన్నికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన 21 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత తాను కాకుండా వేరే వారిని శాసనసభపక్ష నేతగా ఎంపిక చేయాలని భావించిన చంద్రబాబు చివరికి మనసు మార్చుకుని ప్రతిపక్ష నేత బాధ్యత స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో కాలంతో పరుగెత్తి అనేక పనులు చేశామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అనేక కార్యక్రమాలు చేశామని అయినా ప్రజాతీర్పు భిన్నంగా వచ్చిందన్నారు. అయినా 39.2 శాతం ఓట్లు రాబట్టామని తెలిపారు.

ఏదైనా కొంతకాలం వేచిచూద్దామని, కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని పార్టీ నేతలకు చెప్పారు. అన్నింటినీ నిశితంగా పరిశీలించి.. తర్వాతే స్పందిద్దామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ వాణిని బలంగా వినిపించాలన్నారు. ఆయా నియోజకవర్గాల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి, సకాలంలో పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో ప్రజలతో నాయకులంతా మమేకం కావాలన్నారు. ఎక్కడా పార్టీపైన, ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత లేదని, జగన్‌మోహన్‌రెడ్డిపై సానుభూతి ఉండడం వల్లే గెలిచారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందామని, అన్నివర్గాల ప్రజల మద్దతు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఓటమికి కారణాలేమిటని చంద్రబాబు అందరినీ ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలనే జగన్‌ నినాదం బాగా పనిచేసిందని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఓటమిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సివుందని, ఇందుకోసం కొద్దిరోజుల్లో మళ్లీ సమావేశమవుదాని చంద్రబాబు తెలిపారు.  

జగన్‌ ప్రమాణ స్వీకారానికి ప్రతినిధి బృందం  
ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వైఎస్‌ జగన్‌ ఆహ్వానించిన నేపథ్యంలో వెళ్లాలా వద్దా అనే దానిపై సమావేశంలో చర్చించారు. ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళితే ఇబ్బందిగా ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని పంపించాలని  చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు వెళ్లి జగన్‌కు తన తరఫున శుభాకాంక్షలు తెలపాలని, తొలుత ఆయన ఇంటికి వెళ్లి తాను శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖ ఇవ్వాలని సూచించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచే కొద్దికాలం పనిచేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పగా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండదని, విజయవాడ అయితేనే బాగుంటుందని చెప్పారు. దీంతో మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకూ విజయవాడలోనే తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఆ బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నానికి అప్పగించారు. కాగా శాసనసభాపక్ష సమావేశానికి విశాఖపట్నం వెస్ట్‌ ఎమ్మెల్యే గణబాబు గైర్హాజరయ్యారు.  

పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌ 
శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌ నియమిస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో టీడీపీ పక్ష నేతగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాజ్యసభలో టీడీపీ పక్ష నేతగా సుజనా చౌదరి ఉంటారని తెలిపారు.  

మరిన్ని వార్తలు