సీఎంగారి భార్య సంగతేంటి?

30 Jun, 2018 11:01 IST|Sakshi

తనకు న్యాయం చేయాలంటూ అడిగిన ఓ ఉపాధ్యాయురాలిపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్‌ ఆగ్రహం వెల్లగక్కారు. మీడియా ముఖంగానే ఆమెపై అరిచి.. సస్పెండ్‌, అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. సోషల్‌ మీడియా, జాతీయ ఛానెళ్లలో వీడియో వైరల్‌ కావటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే ఆర్టీఐ చట్టం ద్వారా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది. 

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్‌ భార్య సునీత రావత్‌ ప్రైమరీ స్కూల్‌ టీచర్‌గా పని చేశారు. 1992లో పౌదీ గద్వాల్‌లో ఆమె తొలుత బాధ్యతలు చేపట్టారు. అయితే నాలుగేళ్లకే ఆమెను డెహ్రూడూన్‌కు బదిలీ చేశారు. ఆపై 22 ఏళ్లు ఆమె అక్కడే విధులు నిర్వహించారు. పైగా 2008లో ప్రమోషన్‌ కూడా దక్కింది. ఓ సామాజిక వేత్త చొరవతో ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా విషయం వెలుగు చూసింది. ఇక సీఎం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉత్తర బహుగుణ(57) విషయానికొస్తే ఉత్తర కాశీలో 25 ఏళ్లుగా ఆమె టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2015లో భర్త చనిపోవటంతో పిల్లలు దగ్గర ఉండేందుకు డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె గత కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, అధికారులు మాత్రం స్పందించటం లేదు. పైగా ఆమె వంతు వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

దీంతో విసిగిపోయిన ఆ పెద్దావిడ ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి జనతా దర్బార్‌కు వచ్చింది. అయితే సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి కాస్తా ఆ మహిళ మీద కోపంతో విరుచుకుపడ్డారు. దాంతో బహుగుణ ముఖ్యమంత్రిని తిడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ‘సీఎం ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అంతరాయం కల్గించిందనే నేరం’ కింద పోలీసులు బహుగుణను అరెస్ట్‌ చేసి, ఆపై బెయిల్‌ మీద ఆమెను విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆమె తన గోడును వెల్లగక్కారు. ‘న్యాయం చేయమని నేను అక్కడికి వెళ్లాను. నాపై అరిచి ఆధిపత్యం ప్రదర్శించారు. అందుకే బదులుగా నేను అరిచాను. కానీ, కానీ, ఆయన నాపై దొంగ అనే నింద వేశారు. అది మాత్రం తట్టుకోలేకపోయా’ అంటూ బహుగుణ విలపించారు. బహుగుణ వీడియో.. ఆపై ప్రస్తుతం సునీత రావత్‌ బదిలీ వ్యవహారం వెలుగు చూడటంతో పలువురు సీఎం రావత్‌ తీరును ఎండగడుతున్నారు.

మరిన్ని వార్తలు