సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: సీఎం కేసీఆర్‌

24 Jun, 2018 18:33 IST|Sakshi

విపక్షాలు ఒప్పుకుంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి

నాగేందర్‌ తలపై బండ.. 20 రోజుల్లో ఇంకా చాలామంది

సాక్షి, హైదరాబాద్‌: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, పార్టీలను ప్రజలు వదులుకోరని, టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధిని జనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ 100 పైచిలుకు స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సిటీ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, మాజీ మంత్రి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పక్కా సర్వే.. ముందస్తుకు సై: ‘‘ దేశంలో ఏ రాష్ట్రమూ అమలుచేయలేనన్ని గొప్ప గొప్ప పథకాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల మనసును గెలుచుకుంది. యావన్మంది ‘ఔరా!’ అని ముక్కున వేలేసుకునే విధంగా పరిపాలన సాగిస్తున్నాం. కానీ రాష్ట్రంలో జరుగుతోన్న మంచిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. నీటి ప్రాజెక్టులకు అడ్డగోలుగా అడ్డం పడుతున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి వీళ్లు (విపక్షాలు) ఇంకా పిచ్చి కథలుపడతారు. ఇదంతా అవసరమా, ఈ గోలంతా ఎందుకు, సరే, మరి ముందస్తు ఎన్నికలకు పోదామా? అని నేనే వాళ్లను ప్రశ్నిద్దామనుకుంటున్నా. మా పార్టీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. ‘జనం రెడీగా ఉన్నారు.. ముందస్తుకు పోదాం సార్‌’అని! నా లెక్క ప్రకారం కూడా ముందస్తు ఎన్నికలు రావొచ్చని అనుమానంగా ఉంది. ప్రతిపక్షాలు సరేనంటే ముందస్తుకు రెడీగా ఉన్నాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

నాగేందర్‌ తలపై బండ.. 20 రోజుల్లో ఇంకా చాలామంది: హైదరాబాద్‌ను విశ్వనగరంగా, ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ సిటీగా తీర్చిదిద్దాలంటే కష్టపడి పనిచేసే నాయకులు అవసరమని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తోన్న పనులు నచ్చి ఇవాళ దానం నాగేందర్‌ పార్టీలోకి వచ్చాడు. రాబోయే 20 రోజుల్లో ఇంకా చాలా మంది నాయకులు క్యూ కడతారు. ఏదో సుఖపడటానికి ఆయన రాలేదు.. టీఆర్‌ఎస్‌లో చేరడమంటే నాగేందర్‌ నెత్తిన బండ ఎత్తుకున్నట్లే. అంత కష్టపడి పనిచేయాలన్నమాట! కార్యకర్తగా ఉన్నప్పటినుంచీ అతను నాకు తెలుసు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఇక్కడ కూడా మంచి అవకాశాలు, మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తున్నా..’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

సర్వే చూసి నేనే షాకయ్యా! : ఇంతకు ముందు చేయించిన సర్వేలకంటే బలమైన, సత్యప్రమాణాలు అధికంగా ఉన్న మరో సర్వేను ఇటీవలే చేయించానని ముఖ్యమంత్రి తెలిపారు. తాజా సర్వేలో తనతో సహా అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చాయని చెప్పారు. ‘‘తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ బలం 50 శాతానికి మించి పెరిగింది. మిగతా పార్టీలతో డిఫరెన్స్‌ దాదాపు 40 శాతం ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 60వేలు, 70వేలు పైచిలుకు మెజారిటీ సాధించబోతున్నారు. ఈ సర్వే ఫలితాలు చూసి నేనే ఆశ్చర్యపోయాను. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తాను’’ అని సీఎం తెలిపారు.

మరిన్ని వార్తలు