చంద్రబాబు పాలనలోనే కాళేశ్వరం కట్టారు: సీఎం జగన్‌

11 Jul, 2019 10:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన విన్నపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గౌరవించారు. ఆయన ఓ అడుగు ముందుకేసి తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ నుంచి గోదావరి నీటిని తీసుకుంటున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, కృష్ణా ఆయకట్టుకు నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించండి. కేసీఆర్‌ను అభినందించడం మానేసి విమర్శిస్తారా?.

అప్పుడు గాడిదల్ని కాశారా?
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు. అక్కడ కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టారు. ఆయన అధికారంలో ఉండగానే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంతో స్నేహభావంతో మెలగడం తప్పా?. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచారు. గత పదేళ్లలో కృష్ణా జలాల లభ్యత దారుణంగా పడిపోయింది.’ అని అన్నారు.

చదవండి: కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు

మరిన్ని వార్తలు