రాజకీయాల్లోకి వస్తా : వివేక్‌

21 May, 2019 08:30 IST|Sakshi

సాక్షి, చెన్నై :  నేనూ రాజకీయాల్లోకి వస్తానని నటుడు వివేక్‌ అన్నారు. హాస్యనటుడిగా పేరుగాంచిన ఈయన సోమవారం కోడైకెనాల్‌లోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో అమెరికాకు చెందిన మిత్రుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు మంచి నీళ్లు లేని రాష్ట్రంగా మారుతోందనే భయాన్ని వ్యక్తం చేశారు. కాలువలు, చెరువులను శుద్ధి చేసే కార్యక్రమాలను యువత చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్షాన్ని కురిపించే శక్తి చెట్లకు ఉందన్నారు. కాబట్టి విద్యార్థులు మొక్కలు నాటే ప్రయత్నం చేయాలన్నారు. ఇంటర్‌ నుంచి డిగ్రీకి వెళ్లే విద్యార్థులు ప్రతి ఏడాది ఒక మొక్క చోప్పున నాటినా పర్యావరణాన్ని కాపాడగలుతారన్నారు.

తాను అబ్దుల్‌కలాం సూచన మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలను నాటే పథకాన్ని చేపట్టానని తెలిపారు. అందులో ఇప్పటికి 30 లక్షల 23 వేల మొక్కలను నాటానని చెప్పారు. అదే విధంగా రానున్న వర్షాకాలంలో పర్యాటకులు పర్యావరణాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. కాగా నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అడుగుతున్నారని, అది ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అదే విధంగా నటుడు రజనీకాంత్‌ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. తనకు రాజకీయాల గురించి తెలియదని, ప్రస్తుతానికి తనకలాంటి ఆలోచన లేదనిచెప్పారు. అయితే త్వరలో తాను రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని నటుడు వివేక్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు