కన్నడ నాట టి–20

10 Apr, 2019 10:17 IST|Sakshi

20 సీట్లపై బీజేపీ, కాంగ్రెస్‌ కన్ను

దేశంలో జరుగుతోన్న ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో గెలుపు కోసం అన్ని టీములూ హోరాహోరీ పోరాడుతున్నాయి. అదేవిధంగా కర్ణాటకలో పార్టీలు విజయం కోసం 20–20 మ్యాచ్‌ల్లాగానే పోల్‌గ్రౌండ్‌లోకి దిగాయి. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 20 సీట్లను గెలిచి తీరాలని జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి, బీజేపీ టార్గెట్‌ పెట్టుకున్నాయి. స్థానిక ఐపీఎల్‌ టీం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆరు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసి, ఒక్క విజయం కోసం తహతహలాడుతోంది. అదేవిధంగా ఈ పార్టీలు 20 సీట్లను కైవసం చేసుకోగలుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 18, ఏప్రిల్‌ 23 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మోదీ గాలి వీస్తున్నందువల్ల కర్ణాటకలో 20కి పైగా స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. బీజేపీని సింగిల్‌ డిజిట్‌కి పరిమితం చేసి, తాము నిర్దేశించుకున్న 20 సీట్లకు పైగా గెలుచుకుని తీరుతామని కాంగ్రెస్‌–జనతాదళ్‌ (ఎస్‌) కూటమి నాయకులు అన్నారు. అయితే ఇరువురు ప్రత్యర్థులు సాధించాలనుకుంటున్న టీ–20 లక్ష్యం, గత ఎన్నికల్లో గెలిచిన సీట్లూ, వాటి పనితీరును బట్టి వాస్తవానికి దగ్గరగా లేవని అనిపిస్తోంది. ఈ విషయాన్ని వివిధ కారణాల వల్ల బహిరంగంగా బీజేపీ నేతలెవ్వరూ అంగీకరించనప్పటికీ, ఆ పార్టీ అంతర్గత చర్చల్లో, పార్టీ నేతలు మరింత ఆశాజనకంగా ఉన్నారని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే అలా మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు సాధ్యమేనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని సెంచరీని దాటేసి 104 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమిగా ఏర్పడటం వలన ప్రత్యేకించి దక్షిణ కర్ణాటకలో బీజేపీ కఠిన పరీక్షని ఎదుర్కొంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కంచుకోటల్లో గెలిచిన 17 స్థానాలను తిరిగి దక్కించుకోవడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి 20 సీట్ల ప్రస్తావనను పదేపదే ప్రచారంలోకి తెస్తోంది. అయితే వాస్తవానికి ‘సామాజిక మాద్యమాల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతున్న పార్టీ, అనుకున్న సీట్లను ఎలా సాధించగలుగుతుంది. మా రెండు పార్టీలూ ఇంకా కుదురుకోనేలేదు’ అని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 20–20 ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఓడిపోయిన ప్రతిసారీ, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మా టీం పెర్ఫార్మెన్స్‌ని మెరుగుపర్చుకోవాలనీ, ఫీల్డింగ్‌ లోపాలను సరిదిద్దుకోవాలనీ మాట్లాడుతున్నట్టుగానే మా పరిస్థితీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జేడీఎస్‌ ఆశలన్నీ కాంగ్రెస్‌పైనే..
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం 9 స్థానాలను గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకున్న జేడీఎస్‌ ఈసారి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు వచ్చిన 8 స్థానాల్లో సరైన అభ్యర్థులను పెట్టలేక ఇబ్బంది పడుతున్నది. అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తమ విజయావకాశాలను మెరుగుపర్చుకోవాలని ఈసారి జేడీఎస్‌ భావిస్తోంది. తనకు బలమైన కేంద్రాలైన హసన్, మాండ్యా, తుమ్కూరులలో విజయం వైపు ఆశగా చూస్తోంది. అయితే ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఇంకా సఖ్యత, ఒకరిపై ఒకరికి నమ్మకం, విశ్వాసం లేకపోవడం టీం స్పిరిట్‌ని దెబ్బతీసే ప్రమాదం పొంచి వుందని, దీని ప్రభావం అంతిమ ఫలితాలపై ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు