లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా అధీర్‌ చౌదరి

18 Jun, 2019 16:36 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పక్షనేత ఎవరనేదానిపై జరుగుతున్న చర్చకు తెరపడింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలుపోందిన అధీర్‌ చౌదరి.. గతంలో పీసీసీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత ఎవరనేదానిపై త్రీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

16వ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో.. తదుపరి ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభ పక్షనేతగా వ్యవహరించడానికి సుముఖంగా లేకపోవడంతో పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. దీంతో ఇందుకోసం పలువరు పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలించింది. ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు శశిథరూర్‌, మనీశ్‌ తివారీ, అధిర్‌ రంజన్‌ చౌదరి, కేరళకు చెందిన కే.సురేశ్‌ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే సభలో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొవడం, ప్రజా సమస్యలపై గళమెత్తగల నేతను ఎన్నుకోవాలని పార్టీ భావించింది. ఈ మేరకు తీవ్ర స్థాయిలో చర్చలు జరిపిన కాంగ్రెస్‌ అధిష్టానం అధీర్‌ చౌదరి వైపు మొగ్గు చూపింది.

మరిన్ని వార్తలు