హోదా హామీని నిలబెట్టుకోని మోదీ

21 Jul, 2018 09:02 IST|Sakshi
గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద మానవహారం నిర్వహించిన కాంగ్రెస్‌ నాయకులు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ప్రధాని అయిన ఆయన ఐదు కోట్ల ఆంధ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా మోసగించారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పలు రాజకీయపార్టీలు శుక్రవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య సూచనమేరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉడతా వెంకట్రావ్, సీవీ శేషారెడ్డి, పత్తి సీతారాంబాబు మాట్లాడారు.

గతంలో ప్రత్యేక హోదా ఐదేళ్లుకాదు 10 సంవత్సరాలు కావాలని మాట్లాడిన బీజేపీ నాయకులు నేడు హోదా ఇవ్వబోమని చెప్పి ఆంధ్రులను మోసగించారని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న పరిశ్రమలు, విద్యాసంస్థలు, పలు కర్మాగారాలు రాష్ట్రానికి వచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య తొలగిపోతుందన్నారు. ఇదంతా ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. 2019ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తరువాత మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు కె.రఘురాంముదిరాజ్, బాలసుధాకర్, తిరుపయ్య, భవానీ నాగేంద్రప్రసాద్, అనురాధారెడ్డి, లతారెడ్డి, రమణయ్య, మధుబాబు, ఏడుకొండలు, నారాయణరావు, సునీల్‌రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు