‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్‌ ఉద్యమం ప్రారంభిస్తాం’

14 Dec, 2018 20:28 IST|Sakshi
మాట్లాడుతున్న టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై గాంధీభవన్‌లో సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 22 లక్షలు ఓట్లు  నిర్ధాక్షణంగా తొలగించిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండగా ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రధాన అధికారి(ఈసీ) రజత్‌ కుమార్‌, ఇతర అధికారులు టీఆర్‌ఎస్‌ పార్టీకి పేరోల్‌ క్రింద ఉన్నట్లు గుర్తించామని అన్నారు.

వచ్చే పార్టమెంట్‌ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అని వెల్లడించారు. జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతామని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రిటర్నింగ్‌ ఆఫీసర్లు, పోలీసులు కుమ్మకైయి పోలింగ్‌ ఏజెంట్లను కూడా సెంటర్‌లోకి రానివ్వకుండా అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు. నర్సాపూర్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8.8 శాతం ఉన్న పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు 70 శాతం దాటిందని, ఆపై తెల్లారా 90 శాతంగా ఈసీ ప్రకటించని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

చిప్‌లు, ట్యాంపరింగ్‌ సమాచారం సేకరించి సరియైన సమయంలో వాటి గురించి బయట పెడుతామన్నారు. బ్రింగ్‌ బ్యాక్‌ పేపర్‌ బ్యాలెట్‌ ఉద్యమాన్ని హైదరాబాద్‌ నుంచే ప్రారంభిస్తామని, ఈ విషయం పై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోరాడుతామని దాసోజ్‌ చెప్పారు. ఇది మిషన్‌ మాండేటరీ తప్ప పీపుల్స్‌ మాండేటరీ కాదన్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రజలు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రచారానకి రాకుండా అడ్డుకున్నా వాళ్లే వేలాది ఓట్ల మోజారిటీతో గెలిస్తే ఇక ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదని దాసోజ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు