కలప దోషులపై చర్యలు తీసుకోవాలి

18 Jul, 2018 11:19 IST|Sakshi
ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్‌ నేతలు

ఆదిలాబాద్‌: కోట్ల రూపాయల విలువ చేసే కలప పట్టుకున్నా దోషులను పట్టుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని, వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గం డ్రత్‌ సుజాత డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆ దిలాబాద్‌ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా ఆమె ఇంటి నుంచి ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను లోపలికి వెళ్లుకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయటే బైఠాయించారు. డీఎఫ్‌ఓ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కోట్లు విలువ చేసే కలపను పట్టుకున్న అధికారులు, దానికి సంబంధించిన సరైన వివరాలు వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


దీనిపై సమాధానం చెప్పాల్సిన మంత్రి సమాధానం దాటవేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కాగా, డీఎఫ్‌ఓ వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించడంతో గంట తర్వాత డీఎఫ్‌ఓ ప్రభాకర్‌ వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. తమకు కలప వివరాలు తెలియజేయాలని, పట్టుకున్న విలువ, దానికి వెనుక ఉన్న దోషులను బయట పెట్టాలని డీఎఫ్‌ఓతో తెలిపారు. పూర్తి వివరాలు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రాందాస్‌ నాట్లే, సైదుల్లాఖాన్, వామన్‌వాంక్డే, రూప్‌రావు, గన్‌శ్యాం, సంజయ్‌గుండావార్, గిమ్మ సంతోష్, నగేష్, పొచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు