రేవంత్‌ రాకను స్వాగతించాల్సిందే

30 Oct, 2017 02:40 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కుంతియా

కాంగ్రెస్‌ ముఖ్యులతో కుంతియా 

రేవంత్‌ చేరిక పార్టీకి అవసరం 

ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో రాహుల్‌ నిర్ణయిస్తారు  

వచ్చే నెలలో రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన  

సరైన సమయంలో అన్ని పార్టీల నుంచి చేరికలు: ఉత్తమ్‌ 

కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం: డీకే 

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి చేరికను పార్టీ నేతలంతా స్వాగతించాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులతో గోల్కొండ హోటల్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరికపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై పార్టీ నేతల మనోగతాన్ని చెప్పుకోవడానికి ఏఐసీసీ నుంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో కుంతియా వారితో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ తదితరులు కుంతియాతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్‌ గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి చేరిక ఉంటుందని పార్టీ నేతలకు కుంతియా అధికారికంగా వెల్లడించారు. రేవంత్‌కు పార్టీలో ఎలాంటి అవకాశాలు వస్తాయనే అంశం పూర్తిగా రాహుల్‌ గాంధీ పరిధిలో ఉంటుందని వివరించారు. పెద్దనోట్ల రద్దుపై నవంబర్‌ 8న నిరసన పాటిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా తెలంగాణలో నవంబర్‌ నెలలో రాహుల్‌ గాంధీ బహిరంగసభ ఉంటుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి చేరిక పార్టీకి అవసరమేనని కుంతియా చెప్పారు. దీనికి రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు అంగీకరించినట్టుగా తెలిసింది.  

షరతులేమీ లేవు.. పనితీరే ప్రామాణికం: కుంతియా 
రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు చేరినా షరతులేమీ ఉండవని, నాయకుల పనితీరును బట్టి పదవులు, ప్రాధాన్యం ఉంటుందని కుంతియా స్పష్టం చేశారు. పార్టీ నేతలతో భేటీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ముఖ్యనేతలను కలుస్తున్నట్టుగా చెప్పారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో 31న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పారు. రేవంత్‌ రాకను రాష్ట్ర నాయకులెవరూ వ్యతిరేకించడం లేదన్నారు. ఈ అంశంపై మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌నేత డి.కె.అరుణతో ఇప్పటికే చాలాసార్లు మాట్లాడినట్టు ఆయన చెప్పారు. అరుణ కూడా పెద్దగా వ్యతిరేకించడంలేదన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని వెల్లడించారు.  

అధిష్టానం చెప్పినట్టు పనిచేస్తాం: డీకే 
కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు చేరినా స్వాగతిస్తామని, అధిష్టానం ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తామని మాజీమంత్రి డి.కె.అరుణ చెప్పారు. పార్టీకోసం పనిచేస్తున్న తమలాంటి వారి పాత్ర ఎలా ఉందో రేవంత్‌రెడ్డి పాత్ర కూడా అలాగే ఉంటుందని అన్నారు.   

అధికారపార్టీ నుంచి చేరికలు: ఉత్తమ్‌ 
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఇతర పార్టీల నేతలు మాట్లాడుతున్నారని, అవన్నీ సరైన సమయంలో ఉంటాయని అన్నారు. నవంబర్‌ రెండో వారంలో రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా మహబూబాబాద్‌లో గిరిజన గర్జన పేరుతో బహిరంగసభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన మాటలను కూడా అమలుచేయడంలేదని ఉత్తమ్‌ విమర్శించారు.  

మరిన్ని వార్తలు