నాలుగేళ్ల బాలుడి హత్య

30 Oct, 2017 02:41 IST|Sakshi

ఆశా కార్యకర్త దుశ్చర్య ప్రకాశం జిల్లాలో ఘటన

అన్నంలో విషం పెట్టి గతంలో బాలుడి అన్న హత్య?

వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

సాక్షి, చీమకుర్తి రూరల్‌: నాలుగేళ్ల బాలుడికి ఓ ఆశా కార్యకర్త కుర్‌కురే ప్యాకెట్‌లో ఎలుకల మందు కలిపి బలవంతంగా తినిపించి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పిడతలపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాలుడి బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పిన్నిక సుధాకర్‌ యాదవ్‌ రెండో కుమారుడు పిన్నిక ధనుంజయ్‌ (4) ఈనెల 27న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లగా..అదే గ్రామానికి చెందిన వేల్పుల జ్యోతి అనే ఆశా వర్కర్‌ ఎవరూ లేని సమయం చూసి కుర్‌కురే ప్యాకెట్లో ఎలుకల మందు కలిపి బాలుడితో బలవంతంగా తినిపించి మంచినీళ్లు తాగించి వెళ్లిపోయింది. అదే సమయంలో మిగిలిన చిన్నారులు కుర్‌కురే పెట్టమని అడిగితే ఇది మీరు తినేది కాదని చెప్పి ఖాళీగా ఉన్న ప్యాకెట్‌ను పక్కనే ఉన్న గోడపక్కన వేసింది.

కుర్‌కురే తిన్న కొద్దిసేపటికి బాలుడు వాంతులు చేసుకుని ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి బంధువులు అంగన్‌వాడీ కేంద్రంలో విచారణ చేయగా ఆశా వర్కర్‌పై అనుమానం బలపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్టు చేయాలంటూ మృతదేహాన్ని నేరుగా ఆదివారం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉంచి ధర్నాకు దిగారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వేల్పుల జ్యోతిని, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జ్యోతి నుంచి లభించిన సమాచారం ప్రకారం ధనుంజయ్‌ది అనుమానాస్పద కేసు నుంచి హత్య కేసుగా త్వరలో మార్పు చేస్తామని సీఐ తెలిపారు. సుధాకర్‌ మొదటి కుమారుడు, ధనుంజయ్‌కి సోదరుడు తరుణ్‌ (4)ను కూడా ఇలాగే గత ఏడాది నవంబర్‌ 17న ఆశావర్కర్‌ జ్యోతి అన్నం, సాంబార్‌లో విషం కలిపి పెట్టిందన్న అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో తరుణ్‌ ఆరోగ్యం బాగోలేక మృతిచెందాడని భావించామని..ఈ ఘటన చూశాక తరుణ్‌ను చంపింది కూడా జ్యోతేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు